హర్యానాలో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సీజీఎస్‌టీ) సూపరింటెండెంట్ లంచం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి లువ్‌కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు జరిపిన సోదాల్లో ఏకంగా రూ.1.86 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అవినీతి నిరోధక శాఖ అధికారులనే విస్మయానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళితే.. పంచకులలోని లువ్‌కుమార్ నివాసంలో సీబీఐ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.24.29 లక్షల భారత కరెన్సీ, రూ.15.65 లక్షల విలువైన విదేశీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు సుమారు రూ.1.46 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, బిస్కెట్లను అధికారులు గుర్తించారు. 

మొత్తం మీద స్వాధీనం చేసుకున్న సొమ్ము విలువ రూ.1.86 కోట్లుగా తేలింది. ఇవే కాకుండా, ఆరు బ్యాంకు ఖాతాల వివరాలు, వివిధ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, పలు స్థిరాస్తుల డాక్యుమెంట్లను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు, అతని కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న వాహనాల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.

పంచకులలోని సెక్టార్ 25లో విధులు నిర్వర్తిస్తున్న లువ్‌కుమార్, ఓ వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. తన సంస్థకు సంబంధించిన జీఎస్టీ కేసులో అనుకూలంగా వ్యవహరించాలని, భారీ జరిమానాలు విధించకుండా ఉండాలని సూపరింటెండెంట్ లువ్‌కుమార్ రూ.50 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశాడు.

సీబీఐ ప్రతినిధి బీనా యాదవ్ కథనం ప్రకారం.. చర్చల అనంతరం మొదట లంచం మొత్తాన్ని రూ.20 లక్షలకు తగ్గించారు. అయితే ఆ తర్వాత నిందితుడు తన డిమాండ్‌ను రూ.25 లక్షలకు పెంచి, మొదటి విడతగా రూ.10 లక్షలు ఇవ్వాలని కోరాడు. దీంతో సీబీఐ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని, గురువారం నాడు వ్యాపారి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా లువ్‌కుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం ఆయన నివాసంలో సోదాలు చేయగా భారీగా అక్రమాస్తులు బయటపడటంతో అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు.