మెదడులో రక్తప్రసరణను పర్యవేక్షిస్తుందంటూ మార్కెట్లోకి తీసుకొస్తున్న రూ.85 వేల విలువైన ‘టెంపుల్‌’ పరికరంపై వివాదం ముదురుతోంది. ఈ గ్యాడ్జెట్‌ ఆరోగ్య రంగంలో మోసమంటూ వైద్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ తీవ్రంగా ఖండించారు. తమ ఉత్పత్తి వెనుక శాస్త్రీయ పరిశోధన ఉందని, ఇది ప్రజలను మోసం చేసే పరికరం కాదని స్పష్టం చేశారు. వైద్యులు తమ పరిశోధనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

గోయల్‌ తన వాదనలను సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. టెంపుల్‌ అభివృద్ధి కోసం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందులో సుమారు రూ.165 కోట్లకు పైగా తన సొంత నిధులేనని పేర్కొన్నారు. పరికరం పనిచేయకపోతే 14 రోజుల్లో ఎలాంటి కారణం చెప్పకుండానే తిరిగి ఇచ్చే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. తక్షణ లాభాల కోసం తాను రెండు దశాబ్దాలకు పైగా నిర్మించుకున్న వృత్తిపరమైన ప్రతిష్ఠను పణంగా పెట్టబోనని వ్యాఖ్యానించారు. ‘టెంపుల్‌’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకే ఎటర్నల్‌ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకొన్నానని వివరించారు.

శాస్త్రీయ ఆధారాలు ఎక్కడ?
‘టెంపుల్‌’ పరికరం పనితీరుపై పూర్తి స్థాయి శాస్త్రీయ నిర్ధారణకు సమయం పడుతుందని గోయల్‌ అంగీకరించారు. అయితే పరిశోధన కొనసాగుతూనే పరికరాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన దశకు వచ్చామని చెప్పారు. తమ పరిశోధనలకు సంబంధించిన ప్రీప్రింట్‌ పత్రాలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ పత్రాలు అధికారికంగా పీర్‌ రివ్యూ ప్రక్రియ పూర్తికాకముందే పరిశోధన ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాయి. బయటి పరిశోధకులు, వైద్య సంస్థలు తమ పరీక్షా విధానాలను స్వతంత్రంగా పరిశీలించవచ్చని తెలిపారు.

అయితే ప్రముఖ హెపటాలజిస్ట్‌ డాక్టర్‌ సైరియాక్‌ అబ్బీ ఫిలిప్స్‌ (ది లివర్‌ డాక్‌) ఈ పరికరంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మెదడులో రక్తప్రసరణను కొలుస్తున్నట్లు చెబుతున్నా.. వాస్తవానికి ముఖంపై చర్మం, రక్తప్రసరణలో వచ్చే మార్పులనే ఇది గుర్తిస్తోందని ఆయన ఆరోపించారు. మెదడు పనితీరుతో దీనికి సంబంధం ఉందని నిరూపించే పీర్‌ రివ్యూ పరిశోధనలు, వైద్యపరమైన ఫలితాలు లేవని విమర్శించారు. అలాంటి ఆధారాలు లేకుండానే రూ.85 వేలకు ప్రీ-ఆర్డర్లు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు.

టెంపుల్‌ పరికరం ఏం చేస్తుంది?
తల పక్కభాగంలో కణత వద్ద అమర్చుకునేలా టెంపుల్‌ను రూపొందించారు. మెదడులో రక్తప్రసరణలో వచ్చే మార్పులతో పాటు శరీరం అంతర్గతంగా వేడిని నియంత్రించేందుకు ఎంత శ్రమిస్తోందనే విషయాన్ని తెలియజేసే బయోలాజికల్‌ ఎంట్రోపీని కూడా ఇది కొలుస్తుందని సంస్థ చెబుతోంది. అయితే ఈ కొలతలు ఎంతవరకు కచ్చితమైనవి? వాటి ఆధారంగా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు? అన్న అంశాలపై వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ విమర్శల మధ్య టెంపుల్‌లో ఇంకా బయటపెట్టని కీలక ఫీచర్లు ఉన్నాయని గోయల్‌ వెల్లడించారు. వాటిలో కొన్ని వైద్య రంగానికి సంబంధం లేనివని కూడా పేర్కొన్నారు. అయితే అసలు వివాదానికి తెరపడాలంటే సంస్థ చెబుతున్న శాస్త్రీయ వాదనలకు స్వతంత్ర పరిశోధనలు, వైద్యపరమైన ఆధారాలు మద్దతుగా నిలవాల్సి ఉంది.