క్యాన్సర్ చికిత్సలో ప్రొటాన్ థెరపీ ఒక ఆధునిక, అత్యంత ప్రభావవంతమైన విధానంగా గుర్తింపు పొందుతోంది. సంప్రదాయ రేడియేషన్ థెరపీకి భిన్నంగా, ఇది కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం జరగకుండా కాపాడుతుంది. అందుకే ఈ చికిత్సను వైద్య రంగంలో ఒక విప్లవాత్మక ముందడుగుగా భావిస్తున్నారు.

ప్రొటాన్ థెరపీ ఎలా పనిచేస్తుంది?
ప్రొటాన్ థెరపీలో సైక్లోట్రాన్ అనే భారీ యంత్రం ద్వారా అధిక శక్తిమంతమైన ప్రొటాన్ కణాలను ఉత్పత్తి చేస్తారు. ఈ కణాలను ఒక పుంజంలా (బీమ్) మార్చి నేరుగా క్యాన్సర్ గడ్డ (ట్యూమర్)పైకి పంపిస్తారు. దీని ప్రత్యేకత 'బ్రాగ్ పీక్' అనే సూత్రంలో ఉంది. ప్రొటాన్ కణం శరీరంలో ప్రయాణిస్తున్నప్పుడు నెమ్మదిగా శక్తిని కోల్పోతుంది.

కానీ, అది తన గమ్యాన్ని చేరే చివరి క్షణంలో తన శక్తిని మొత్తం ఒక్కసారిగా విడుదల చేసి, ట్యూమర్‌ను నాశనం చేస్తుంది. ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల ట్యూమర్ దాటిన తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు రేడియేషన్ సోకదు. దీనిని 'జీరో ఎగ్జిట్ డోస్' అని పిలుస్తారు. 'పెన్సిల్ బీమ్ స్కానింగ్' అనే ఆధునిక పద్ధతి ద్వారా ట్యూమర్ ఆకృతికి అనుగుణంగా ప్రొటాన్ కిరణాలను పంపి, పక్కనే ఉన్న కీలక అవయవాలను కాపాడటం సాధ్యమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
"ప్రొటాన్లు క్యాన్సర్‌ను మెరుగ్గా చంపుతాయని కాదు, ఆరోగ్యకర భాగాలను కాపాడటంలోనే వాటి అసలు ప్రయోజనం ఉంది" అని డాక్టర్ చిలుకూరి స్పష్టం చేశారు. ఈ చికిత్స వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందేది పిల్లలే. వారి శరీరాలు ఎదుగుదల దశలో ఉండటం వల్ల, రేడియేషన్ దుష్ప్రభావాలు, భవిష్యత్తులో సెకండరీ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

2022లో 'ఫ్రాంటియర్స్ ఇన్ ఆంకాలజీ'లో ప్రచురితమైన ఒక సమీక్ష ప్రకారం, ఎక్స్-రే చికిత్సతో పోలిస్తే ప్రొటాన్ థెరపీ పిల్లలలో సెకండరీ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తేలింది. పెద్దవారిలో మెదడు, వెన్నెముక, కన్ను, తల, మెడ భాగాల్లోని కీలక అవయవాలకు దగ్గరగా ఉన్న ట్యూమర్ల చికిత్సకు ఇది అత్యంత సురక్షితమైనది. ఈ చికిత్సలో ఎలాంటి నొప్పి గానీ, అసౌకర్యం గానీ ఉండదు.

ఎందుకింత ఖరీదు?.. సవాళ్లు ఏంటి?
ప్రొటాన్ థెరపీ అత్యంత ఖరీదైనది కావడానికి ప్రధాన కారణం దాని మౌలిక సదుపాయాలే. పార్టికల్ యాక్సిలరేటర్ (సైక్లోట్రాన్), టన్నుల బరువుండే అయస్కాంతాలు, రోగి చుట్టూ తిరిగే భారీ గాంట్రీ, రేడియేషన్‌ను ఆపేందుకు మందపాటి కాంక్రీట్ గోడలు అవసరం. ఒక సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 

ప్రస్తుతం మన దేశంలో చెన్నైలోని అపోలో ప్రొటాన్ క్యాన్సర్ సెంటర్, నవీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్‌లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. త్వరలో అసోంలో మూడో కేంద్రం ప్రారంభం కానుంది.

అయితే, ఈ చికిత్స అందరికీ అందుబాటులోకి రావడానికి కొన్ని పెద్ద సవాళ్లున్నాయి. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ యోగేంద్ర నారాయణ్ శ్రీవాస్తవ ప్రకారం, ఈ చికిత్సకు ముందు క్యాన్సర్ కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఫ్లోరిన్-18 వంటి రేడియోయాక్టివ్ ట్రేసర్లతో కూడిన ఇమేజింగ్ (PET స్కాన్) అవసరం. 

ఈ ట్రేసర్లు అతికొద్ది నగరాల్లోనే తయారవుతున్నాయి. ఇలాంటి డయాగ్నస్టిక్ సౌకర్యాలు దేశవ్యాప్తంగా విస్తరించనంత వరకు, ఇంతటి ఖరీదైన యంత్రాలు కేవలం కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కచ్చితత్వంతో ట్యూమర్‌ను నాశనం చేసే ఈ టెక్నాలజీ ఒక వరం లాంటిదే అయినా, ఆ వరం అవసరమైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే అసలైన సవాల్.