ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విదేశీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. డిసెంబర్ 6 నుంచి 11వ తేదీ వరకు ఆయన డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హేగన్‌, యూకే రాజధాని లండన్‌లో పర్యటించనున్నారు. కోపెన్‌హేగన్‌లో జరగనున్న ‘ఏఐ ఫర్ గవర్నమెంట్‌ ఇన్నోవేషన్‌ ఫోరం’లో పాల్గొనేందుకు ఈ పర్యటన ఖరారైంది.

ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు నవంబర్ 19న జీఓఆర్టీ నెం. 2172ను జారీ చేశారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే, ఈ పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి రాజకీయ అనుమతులు తప్పనిసరిగా పొందాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పర్యటనకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ భరించనుంది. ప్రయాణ సమయంతో కలిపి మొత్తం ఆరు రోజుల పాటు మంత్రి లోకేశ్ పర్యటన కొనసాగనుంది.