న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో ప్రారంభమైన తొలి టెస్టు తుది జట్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ గట్టి బదులిచ్చారు. టీమిండియాలో ఎలాంటి మతపరమైన కోణాలు ఉండవని, ఆటగాళ్ల ఎంపిక కేవలం జట్టు అవసరాలు, కూర్పుపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సిరాజ్ ఎంపికపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. "అతడి పేరు సిరాజ్ కావడమే దీనికి కారణం కాదా? రాణిస్తున్నప్పటికీ జట్టులోకి తీసుకోకపోవడానికి ఇంతకంటే వేరే కారణం ఏముంటుంది?" అంటూ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ ఆరోపణలను సంజయ్ భరద్వాజ్ పూర్తిగా కొట్టిపారేశారు. "ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన మాటలు. భారత క్రికెట్ జట్టులో హిందూ-ముస్లిం అనే భేదభావాలకు తావే లేదు. అక్కడ ఆడే ప్రతి ఒక్కరూ భారతీయులే. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. గంభీర్ ఎప్పుడూ సిరాజ్‌కు మద్దతుగానే నిలిచాడు. ఏ ఆటగాడిపైనా అతడికి వ్యక్తిగత కక్షలు ఉండవు. సరైన కాంబినేషన్‌తో బలమైన జట్టును తయారు చేయడమే కోచ్ లక్ష్యం. బీసీసీఐ కూడా ఇలాంటి విభజనలను ఎప్పుడూ ప్రోత్సహించదు. జట్టు అవసరాలు, ఆటగాళ్ల ప్రదర్శన, కాంబినేషన్ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయి" అని భరద్వాజ్ తేల్చిచెప్పారు.

ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న సిరాజ్‌ను పక్కన పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లతో పాటు యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌కు మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. సీనియర్ అయిన సిరాజ్‌ను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. అయితే, జట్టు మేనేజ్‌మెంట్, కెప్టెన్ చర్చించి మ్యాచ్‌కు అత్యంత పటిష్ఠమైన కూర్పును ఎంపిక చేశారని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఈ నిర్ణయాన్ని సమర్థించాడు.