ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా నుంచి వచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఎక్స్‌ఈవీ 9ఎస్' భద్రతలో సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ ఎన్‌క్యాప్ (బీఎన్‌సీఏపీ) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ ఏడు సీట్ల ఈవీ పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. ఈ రేటింగ్ ఎక్స్‌ఈవీ 9ఎస్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని మహీంద్రా స్పష్టం చేసింది.

భారత్ ఎన్‌క్యాప్ పరీక్షల్లో పెద్దల రక్షణ విభాగంలో 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు, పిల్లల రక్షణ విభాగంలో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లను ఈ కారు సాధించింది. ఫ్రంటల్ డిఫార్మబుల్ బారియర్ టెస్టులో డ్రైవర్ తల, మెడ, ఛాతీ, తొడలు, పాదాలకు 'గుడ్' ప్రొటెక్షన్ లభించింది. సహ ప్రయాణికుడి శరీర భాగాలకు కూడా అత్యుత్తమ రక్షణ లభించగా, ఛాతీ భాగానికి 'అడిక్వేట్' రేటింగ్ వచ్చింది. అలాగే సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టుల్లోనూ అన్ని శరీర భాగాలకు పూర్తిస్థాయిలో 'గుడ్' రేటింగ్‌ను దక్కించుకుని దృఢత్వాన్ని నిరూపించుకుంది.

ప్రయాణికుల భద్రత కోసం ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హైయర్ వేరియంట్లలో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అధునాతన అడాస్ ఫీచర్లు లభిస్తాయి. ఈ ఈవీ 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. పూర్తి ఛార్జింగ్‌పై గరిష్ఠంగా 679 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఎక్స్‌ఈవీ 9ఎస్ ప్రారంభ ధర రూ. 20.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.