దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అధికారిక గణాంకాల ప్రకారం, గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే పసిడి ధరల్లో క్షీణత నమోదైంది. అయితే బులియన్ మార్కెట్ బెంచ్‌మార్క్ రేట్లకు, ప్రముఖ రిటైల్ షోరూంలు నిర్ణయించే ధరలకు మధ్య వ్యత్యాసం కొనసాగుతోంది.

ఐబీజేఏ ముగింపు లెక్కల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల (999 ప్యూరిటీ) బంగారం ధర రూ.838 తగ్గి రూ.1,34,971 వద్ద నిలిచింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల (916 ప్యూరిటీ) బంగారం ధర రూ.768 తగ్గి రూ.1,23,633 కు చేరింది. అటు వెండి ధర కూడా భారీగా పతనమైంది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.1,78,000గా ఉన్న కిలో వెండి ధర దాదాపు రూ.7,749 తగ్గి రూ.1,70,251కి చేరింది.

రిటైల్ మార్కెట్‌ను పరిశీలిస్తే నిన్నటి ముగింపు ధరల ప్రకారం ప్రముఖ సంస్థల మధ్య ధరల్లో తేడాలు ఉన్నాయి. తనిష్క్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,900గా ఉంది. కల్యాణ్ జ్యువెలర్స్‌లో 22 క్యారెట్ల రేటు రూ.1,25,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,36,800 వద్ద కొనసాగుతోంది. మలబార్ గోల్డ్, జాయ్ అలుక్కాస్, జీఆర్టీ వంటి ప్రముఖ షోరూంలలోనూ 22 క్యారెట్ల రేటు దాదాపు రూ.1,25,400 స్థాయిలో నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి పరిణామాలు విలువైన లోహాల ధరలపై ఒత్తిడి పెంచాయి.