కన్నడలో ఇటీవల రూపొందిన ఒక చిన్న సినిమా, అక్కడి బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిలించి వేసింది. ఆ సినిమా పేరే 'ప్రేమద ఊరలి'. కేవలం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 150 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. కదిలించే కంటెంట్ ఉంటే, స్టార్స్ లేకపోయినా విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తుందని నిరూపించిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషలలో ఈ రోజు ( నవంబర్ 17) నుంచి అందుబాటులోకి వచ్చింది. 

అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్లో తనకున్న పొలాన్ని సాగుచేసుకుంటూ  'నాగన్న' (రంగాయన రఘు) నివసిస్తూ ఉంటాడు. భార్య చనిపోవడంతో కొడుకు 'సంతోష్' ( శ్రీరామ్) ఆలనా పాలన తానే చూస్తూ పెంచుతాడు. ఈ విషయంలో అతనికి అత్తగారు సహకరిస్తుంది. సంతోష్ ను గారంగా పెంచడం వలన అతనికి పెద్దగా చదువు అబ్బదు. అందువలన బాగా చదువుకున్న అమ్మాయినే కోడలిగా తెచ్చుకోవాలని నాగన్నకు ఉంటుంది. 

నాగన్న చెల్లెలు 'రాజీ' ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆ సంఘటనను తలచుకుని అప్పుడప్పుడు అతను చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే తన కొడుకును ప్రేమగా చూసుకోవాలనే ఉద్దేశంతో అతను మళ్లీ పెళ్లి చేసుకోడు. అందువలన ఆ ఇంటికి ఆడతోడు కరువవుతుంది. ఆ ఊళ్లో నాగన్నని మామయ్య అని పిలుచుకుంటూ చలాకీగా ఉండే అమ్మాయి ఒక్క 'వసంత'నే. సంతోష్ దగ్గర కూడా ఆమెకి చాలా చనువు ఉంటుంది. ఆమెను కోడలిగా చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా నాగన్నకి ఉంటుంది. 

సంతోష్ పెద్దగా చదువుకోకపోవడం వలన .. రైతులకు ఎవరూ పిల్లనివ్వకపోవడం వలన అతనికి పెళ్లి కాదేమోనని నాగన్న టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ సందర్భంలోనే పట్నానికి చెందిన అమ్మాయి రుక్మిణి, సంతోష్ కంటపడుతుంది. ఆ క్షణం నుంచి అతను ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. ఆమె అడ్రెస్ వెతికి పట్టుకునే పనిలో పడతాడు. ఈ నేపథ్యంలో తనకి సంతోష్ పై ఉన్నది  ప్రేమ అని గ్రహించిన వసంత, తన మనసులోని మాటను అతనికి చెప్పడానికి సిద్ధమవుతుంది. 

అలాంటి పరిస్థితులలో తండ్రితో కలిసి ఒక పెళ్లికి వెళతాడు సంతోష్. సంబంధం చెడిపోయి పీటలపై కూర్చున్న రుక్మిణిని చూసి బిత్తరపోతాడు. ఆమె మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తాడు. ఆ తరువాతనే అతనికి రుక్మిణి గురించిన ఒక విషయం తెలుస్తుంది. అదేమిటి? అప్పుడు సంతోష్ ఏం చేస్తాడు? తనకి అతను దక్కలేదనే బాధతో వసంత ఏం చేస్తుంది? నాగన్న ఫ్యామిలీలో ఆడవాళ్లకు చోటులేదు అనే ప్రచారానికి తెరపడుతుందా? అనేది మిగతా కథ.

నాగన్న చేతిలో పసిబిడ్డను ఉంచి భార్య కన్ను మూస్తుంది. మళ్లీ పెళ్లి ఆలోచన లేకుండా ఆ బిడ్డను పెంచుతాడు నాగన్న. రైతులను పెళ్లి చేసుకోవడానికి .. పల్లెటూరు వెళ్లి ఉండటానికి ఇష్టపడని అమ్మాయిల కారణంగా అతనికి టెన్షన్ పట్టుకుంటుంది. తనకి దూరమైనా కొడుక్కి పెళ్లయితే చాలనుకునే నాగన్న .. తండ్రి నుంచి దూరం చేసే పెళ్లి తనకి అవసరం లేదని భావించే సంతోష్. ఈ ఇద్దరి చుట్టూ తిరిగే కథనే ఇది.

పల్లెటూళ్లో తండ్రీకొడుకులుగా నాగన్న - సంతోష్ ల అనుబంధానికి అద్దం పట్టే సన్నివేశాలు,  సంతోష్ .. అతని ఫ్రెండ్స్ ఆటపాటలు, అతనిని వసంత ఆరాధించడం .. అతనేమో రుక్మిణిని పెళ్లి చేసుకుని తీసుకురావడం వరకూ ఫస్టాఫ్ గా సాగుతుంది. ఇక పెళ్లయిన తరువాత రుక్మిణి - సంతోష్ లకు సంబంధించిన సన్నివేశాలు సెకండాఫ్ గా ఆడియన్స్ ను పలకరిస్తాయి. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతే, సెకండాఫ్ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ వెళుతుంది.

'ప్రేమద ఊరలి' అంటే 'ప్రేమ అనే ఊరిలో' అని అర్థం. దర్శకుడు ఈ కథ మొత్తాన్ని విలేజ్ నేపథ్యంలో నడిపించాడు. తన కుటుంబానికి కోడలిగా ఒక ఆడదిక్కు కావాలని ఆరాటపడే నాగన్న, భార్యగా తన జీవితంలోకి అడుగుపెట్టిన అమ్మాయి తనని ఎంతో ప్రేమగా చూసుకోవాలని భావించే సంతోష్ పాత్రలే ఈ కథకి రెండు కళ్లుగా చెప్పుకోవలసి ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకూ ఈ రెండు పాత్రలను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఈ కథలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఒక చిన్న పాత్ర తప్ప, విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండడు. అయినా అలాంటి పాత్ర లేదనే ఆలోచన ఎక్కడా కలగదు. ఇటు తండ్రి .. అటు కొడుకు పాత్రలలో వ్యక్తిత్వం .. ఆదర్శం ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అలాగే వసంత పాత్ర వైవు నుంచి .. రుక్మిణి పాత్ర వైపు నుంచి అల్లుకొచ్చిన సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. ప్రతి పాత్ర వలన ప్రయోజనం కనిపిస్తుంది. ఆ పాత్రలతో డిజైన్ చేసిన దృశ్యాలలో సహజత్వం తొణికిసలాడుతుంది. 

కథ .. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ఎంతటి బలంగా నిలిచాయో, లొకేషన్స్ కూడా అంతే హైలైట్ గా నిలిచాయి. పాటలు కూడా ఇవే లొకేషన్స్ లో చిత్రీకరించడం వలన, నిజంగానే కథ అంతా ఒకే దగ్గర జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ లొకేషన్స్ లో శివాలయం .. అక్కడి దృశ్యాలు మరింతగా మనసుకు పట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దృశ్యాలు దాదాపు వర్షంలోనే ప్లాన్ చేయడం వలన అవి మరింత ఇంపాక్ట్ చూపిస్తాయి.

రాజ్ కాంత్ ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి దృశ్యానికి ఆయన జీవం పోసినట్టుగా అనిపిస్తుంది. ఇక  సునాద్ గౌతమ్ బాణీలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత సపోర్ట్ చేస్తూ నిలబెడుతుంది. హర్షిత్ ప్రభు ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది. క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ నిడివి కాస్త తగ్గిస్తే బాగుండునని మాత్రం అనిపిస్తుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా, తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి సన్నివేశంలోను బలం కనిపిస్తుంది .. ఆత్మ కనిపిస్తుంది. ఫీల్ వర్కౌట్ అయింది. అందమైన కథను ఆహ్లాదకరమైన వాతావరణంలో చెప్పిన సినిమాగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేస్తుందని చెప్పచ్చు.