వాషింగ్టన్‌లోని ట్రంప్ ప్రభుత్వ అగ్రశ్రేణి అధికారులను లక్ష్యంగా చేసుకుని రసాయన దాడి లేదా 'డర్టీ బాంబ్' పేల్చేందుకు ఇరాన్ వ్యూహం రచిస్తోందని అమెరికా భావిస్తోంది. ఈ విషయం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యూఎస్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికల ఆధారంగా సీఎన్ఎన్ ఈ సంచలన కథనాన్ని వెల్లడించింది. దాడులు చేయాలనుకుంటున్న నిర్దిష్ట ప్రాంతాలు, లక్ష్యాలకు సంబంధించిన వివరాలు తమ నిఘా వర్గాలకు లభించినట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా రక్షణ విభాగాలు తమ భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం స్వదేశానికి ఎటువంటి ప్రమాదం లేదని, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ వెల్లడించారు. ఇటీవల 123 మంది చిన్నారులు మరణించిన మినాబ్ పాఠశాల దాడికి బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు యూఎస్ నేవీ అధికారులకు ఇరాన్ నేరుగా హెచ్చరికలు జారీ చేసింది.

ఆ వెంటనే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్‌ను ఆయన నివాసం నుంచి సురక్షితమైన మిలిటరీ స్థావరానికి తరలించారు. హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనం, యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిళ్ల నడుమ, అమెరికా గడ్డపైనే దాడులు చేయడానికి టెహ్రాన్ పథకాలు రచిస్తోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

అణ్వాయుధం మాదిరిగా విచ్ఛిత్తి (ఫిషన్) జరగకపోయినా, సంప్రదాయ పేలుడు పదార్థాలతో రేడియోధార్మిక లేదా రసాయన పదార్థాలను కలిపి 'డర్టీ బాంబ్' తయారు చేస్తారు. దీనివల్ల విస్తారమైన ప్రాంతంలో ప్రమాదకర రసాయనాలు వ్యాపించి ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. 

అమెరికాలోనే ఉన్న వ్యక్తుల సాయంతో బాంబు తయారీ సామాగ్రిని ఇప్పటికే సిద్ధం చేసి ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే అమెరికా అధికారులపై రసాయన దాడి జరిగితే ఎదుర్కొనేందుకు బలగాలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రసాయన ఆయుధాల వినియోగాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ మిషన్ కొట్టిపారేసింది.