ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు విభాగాల్లో పనిచేస్తున్న కో-ఆర్డినేటర్ల వేతనాలను 23 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా పెంపుతో జిల్లా కో-ఆర్డినేటర్ల (డీసీ) వేతనం ప్రస్తుతం ఉన్న రూ.36,000 నుంచి రూ.44,280కి పెరగనుంది. అదేవిధంగా, అసిస్టెంట్‌ జిల్లా కో-ఆర్డినేటర్లు (ఏడీసీ), టౌన్‌ కో-ఆర్డినేటర్ల (టీసీ) జీతం రూ.27,000 నుంచి రూ.33,210కి చేరనుంది. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సేవల పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం వంటి కీలక బాధ్యతలను ఈ కో-ఆర్డినేటర్లు నిర్వర్తిస్తున్నారు.

2020లో కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో చేరిన వీరికి ఇప్పటివరకు వేతన సవరణ జరగలేదు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వీరి విజ్ఞప్తిపై ప్రభుత్వం తాజాగా సానుకూలంగా స్పందించి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కో-ఆర్డినేటర్లకు ఆర్థికంగా ఊరట లభించనుంది.