ఐపీఎల్‌లో రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న స్టార్ పేసర్ హర్షల్ పటేల్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) గూటికి చేరాడు. రాబోయే సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) నుంచి హర్షల్ పటేల్‌ను ట్రేడింగ్ ద్వారా గుజరాత్ సొంతం చేసుకున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. 2025 మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇతడిని రూ.8 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు సగానికి తగ్గించి రూ. 4 కోట్ల ధరకు గుజరాత్ టైటాన్స్‌కు బదిలీ చేసింది.

ఈ తాజా ఒప్పందంతో హర్షల్ పటేల్ తన సొంత రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నాడు. అహ్మదాబాద్‌లో జన్మించిన ఈ సీనియర్ పేసర్, ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలోనూ అతడిని దక్కించుకునేందుకు గుజరాత్ ఫ్రాంచైజీ గట్టిగానే ప్రయత్నించింది. 2024 వేలంలో రూ.10.5 కోట్ల వరకు పోటీపడి వెనక్కి తగ్గగా, పంజాబ్ కింగ్స్ రూ. 11.75 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత 2025 వేలంలోనూ గుజరాత్ రూ.6.5 కోట్ల వరకు బిడ్ వేసి రేసు నుంచి తప్పుకొంది. ఎట్టకేలకు ఇప్పుడు ట్రేడ్ ద్వారా అతడిని తమ బౌలింగ్ విభాగంలోకి చేర్చుకుంది. అక్కడ కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్ వంటి అనుభవజ్ఞులైన పేసర్లతో కలిసి హర్షల్ బరిలోకి దిగనున్నాడు.

35 ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 124 మ్యాచ్‌లాడి 151 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ (2021), పంజాబ్ కింగ్స్ (2024) తరఫున అత్యధిక వికెట్లు తీసి రెండుసార్లు పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అయితే 2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసినప్పటికీ, గత సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే అవకాశాలు దక్కించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటికే బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేసే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి టి.నటరాజన్‌ను, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఎక్స్ఛేంజ్‌లో ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను తమ జట్టులోకి తీసుకుంది.