అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో ఈరోజు అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా బలపడింది. ముడి చమురు ధరలు తగ్గడం, దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం బలంగా కొనసాగడం రూపాయికి మద్దతుగా నిలిచాయి. నేటి ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ 31 పైసలు లాభపడి 93.62 వద్ద కొనసాగుతోంది.

ఈ ఉదయం మార్కెట్ ప్రారంభంలో 93.72 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన రూపాయి, కొద్దిసేపటికే మరింత పుంజుకుంది. నిన్న‌టి ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి 25 పైసలు లాభపడి 93.94 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే.

కరెన్సీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. తగ్గుతున్న చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గడం, దేశీయ మార్కెట్లు బలంగా ఉండటం వంటి అంశాలు రూపాయికి సానుకూలంగా మారాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) వరుసగా ఐదో రోజు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నిన్న‌ ఒక్కరోజే వారు రూ. 4,864 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

అయితే, మరోవైపు అమెరికా డాలర్ బలపడటం రూపాయి లాభాలకు కొంతమేర అడ్డుకట్ట వేస్తోంది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.04% పెరిగి 103.50 వద్ద ఉంది. ఇది 2025 ఏప్రిల్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు డాలర్‌కు బలాన్నిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ధర 0.75 శాతం తగ్గి బ్యారెల్‌కు $91.75 వద్ద ట్రేడ్ అవుతోంది. ప‌శ్చిమాసియా నుంచి సరఫరా మెరుగవడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.