గూగుల్ మ్యాప్స్ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ ఫీచర్లను తీసుకొచ్చింది. మ్యాప్స్‌లోని ‘ఆస్క్ మ్యాప్స్’ (Ask Maps) టూల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ట్రావెల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని వ్యాపార సంస్థల్లో అపాయింట్‌మెంట్లను కూడా సులభంగా వెతుక్కోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ అప్‌డేట్‌ను విడుదల చేశారు.

ఈ కొత్త ఫీచర్ల ద్వారా పలు రోజుల ప్రయాణ షెడ్యూళ్లను యూజర్లు క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. ప్రతి స్టాప్‌కు సంబంధించిన సమయాలు, ప్రయాణ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. మార్గమధ్యంలో కొత్త ప్రదేశాలు లేదా హోటళ్లను చేర్చమని అడిగితే ఏఐ వెంటనే ప్లాన్‌ను మార్చి ఇస్తుంది. ఈ షెడ్యూళ్లను స్నేహితులతో పంచుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో గూగుల్ డాక్స్‌లోకి కూడా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. ప్రయాణ మార్గంలో ఉండే పార్కింగ్, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, ట్రాఫిక్, వాతావరణం, టోల్ వివరాలను కూడా ఇది ముందే తెలియజేస్తుంది.

కార్ సర్వీసింగ్, బ్యూటీ పార్లర్లు, పెట్ కేర్ వంటి సేవల కోసం సమీపంలో ఎక్కడ స్లాట్లు ఖాళీగా ఉన్నాయో ఈ టూల్ కనిపెడుతుంది. అవసరమైతే ఏఐ అసిస్టెంట్ స్వయంగా సంబంధిత సంస్థలకు కాల్ కూడా చేస్తుంది. యూజర్లు సేవ్ చేసుకున్న రెస్టారెంట్లలో వెంటనే టేబుల్ దొరుకుతుందో లేదో క్షణాల్లో చెక్ చేసి చెబుతుంది. యూరప్‌లోని మరో 30 దేశాలకు విస్తరించడంతో ఈ సర్వీస్ మొత్తం 200కు పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే అపాయింట్‌మెంట్ సెర్చ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ప్రస్తుతం అమెరికాలో మొదలుపెట్టారు. త్వరలోనే మిగతా ప్రాంతాలకూ విస్తరించనున్నారు.