సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ నీటి సంరక్షణ, యాజమాన్య పద్ధతుల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. గత 10 నెలల స్వల్ప వ్యవధిలోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని రికార్డు స్థాయిలో తగ్గించుకుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భారీ ఎత్తున ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకుని ఇతర విద్యా, పారిశ్రామిక సంస్థలకు మార్గదర్శకంగా నిలిచింది.

గతంలో మంజీరా, సింగూరు రిజర్వాయర్ల నుంచి ఐఐటీహెచ్ నిత్యం దాదాపు 2,000 కిలోలీటర్ల నీటిని వాటర్ బోర్డు ద్వారా తీసుకునేది. ప్రస్తుతం ఆ వినియోగాన్ని కేవలం 700 కిలోలీటర్లకు పరిమితం చేసింది. దీనివల్ల గతంలో నెలకు కోటి రూపాయలకు పైగా వచ్చే నీటి బిల్లు, ఇప్పుడు ఏకంగా రూ. 42 లక్షలకు పడిపోయింది. అంటే నెలకు దాదాపు రూ. 58 లక్షలకు పైగా ఆదా అవుతోంది.

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, వేసవిలో సింగూరు, మంజీరా జలాశయాల్లో తాగునీటి నిల్వలు గణనీయంగా తగ్గడంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంస్థలన్నీ వచ్చే వర్షాకాలం వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ సూచించారు. ఈ పిలుపును ఐఐటీహెచ్ యాజమాన్యం ఒక సవాలుగా స్వీకరించి సమగ్ర కార్యాచరణను అమలు చేసింది.

నీటి పొదుపు చర్యల్లో భాగంగా వ్యర్థ జలాల పునర్వినియోగానికి సంస్థ పెద్దపీట వేసింది. క్యాంపస్‌లో ఒక్కొక్కటి 650 కేఎల్‌డీ సామర్థ్యం కలిగిన మూడు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను (ఎస్టీపీ) పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులు, ఉద్యానవనాలకు మళ్లిస్తున్నారు. అలాగే భూగర్భ జలాల పెంపునకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. క్యాంపస్ పరిధిలో చెరువులు, కృత్రిమ కుంటలతో పాటు దాదాపు 14.84 కిలోమీటర్ల మేర బయో-స్వేల్స్ (వరద నీటి కాలువలు) నిర్మించారు. వీటి ద్వారా వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి భూమిలోకి ఇంకేలా చేస్తున్నారు. ఈ వ్యవస్థల ద్వారా సుమారు 4.79 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని సంస్థ సమకూర్చుకుంది.

వర్షపు నీటి సంరక్షణ సమర్థవంతంగా సాగడంతో క్యాంపస్‌లోని భూగర్భ జలమట్టాలు పెరిగాయి. దీని ఆధారంగా అవసరమైన చోట 33 బోర్లను వినియోగిస్తూ నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు క్యాంపస్‌లో ఎక్కడా నీరు వృథా కాకుండా పైప్‌లైన్ లీకేజీలను తక్షణమే అరికట్టారు. క్యాంపస్‌లో నివసించే దాదాపు 7,300 మంది విద్యార్థులు, సిబ్బందితో పాటు రోజూ వచ్చివెళ్లే సందర్శకులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు.

సంగారెడ్డి జిల్లాలో సాధారణంగా భూగర్భ జలమట్టాలు పడిపోతున్న పరిస్థితుల్లో, కిసాన్ సాగర్, చిమ్నా సాగర్ చెరువుల మధ్య కఠినమైన రాతి నేలల్లో ఉన్నప్పటికీ ఐఐటీహెచ్ తన నీటి వనరులను కాపాడుకోగలగడం విశేషం. భవిష్యత్తులో క్యాంపస్ జనాభా మరింత పెరిగినా బాహ్య నీటి వనరులపై ఆధారపడటాన్ని తక్కువగానే ఉంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐటీహెచ్ సాధించిన ఈ ఘనతను పరిగణనలోకి తీసుకుని, పరిసరాల్లోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓఎఫ్డీ వంటి భారీ సంస్థలు కూడా ఇదే పద్ధతులను అనుసరించాలని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులు సూచించారు.