టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ భవిష్యత్తుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కుతుందా? అన్న ప్రశ్నకు కొత్త చీఫ్‌ సెలక్టర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సమాధానం చెప్పాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ కేవలం 30 పరుగులే చేయడం ఈ చర్చకు కారణమైంది. ఫామ్‌ కోల్పోయినప్పటికీ ఆట (కెరీర్) కొనసాగించాలన్న అతడి పట్టుదల.. సెలక్టర్లకు చిక్కుముడిగా మారింది.

జూనియర్‌ క్రికెట్‌ రోజుల నుంచి రోహిత్‌, ఓజా మధ్య స్నేహం ఉంది. గతంలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో జరిగిన శిక్షణ శిబిరాల సమయంలోనూ వారి అనుబంధం బలపడింది. ఇప్పుడు ఓజా సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో రోహిత్‌ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగత అనుబంధాన్ని పక్కనపెట్టి, ఆటగాడి ప్రస్తుత సామర్థ్యం, ప్రపంచకప్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సూచనతో ఓజా.. రోహిత్‌తో సమావేశమయ్యాడు. లార్డ్స్‌లో జరిగే మ్యాచ్‌ సందర్భంగా వన్డేలకు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నాడా? అన్నది తెలుసుకోవడమే ఆ భేటీ ఉద్దేశం. అయితే ఆ ప్రతిపాదనపై రోహిత్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌ను నడిపిస్తున్న వారిపై తన అసహనాన్ని కూడా వెల్లడించాడు. ఆ పరిణామాల తర్వాత అగార్కర్‌-రోహిత్‌ మధ్య వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిన్నాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అగార్కర్‌ స్థానంలో వచ్చిన ఓజాకు ఆ బాధ్యత బదిలీ అయింది.

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో టాప్‌ ఆర్డర్‌ పదేపదే కుప్పకూలడంపై కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే భారత్‌ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సిరీస్‌ను 3-1తో గెలుచుకుంది. రోహిత్‌ కూడా సీమింగ్‌, బౌన్స్‌ ఉన్న పిచ్‌లపై ఇబ్బంది పడ్డాడు. వెస్టిండీస్‌తో స్వదేశంలో రాణించినప్పటికీ, న్యూజిలాండ్‌లో పరిస్థితుల్లో అతడి వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బౌన్స్‌ను ఎదుర్కోవడం, పవర్‌ప్లేలో నిలదొక్కుకోవడం అతడికి సవాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో ఆడాలన్న మనసుకు, శరీర స్పందనకు మధ్య సమన్వయం కనిపించడం లేదని విశ్లేషణ పేర్కొంది.

ప్రపంచకప్‌కు ముందు భారత్‌ స్వదేశంలో మరో 6 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత 6 నెలల విరామం ఉంటుంది. శ్రీలంక, జింబాబ్వేలతో స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల్లో రోహిత్‌ భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉందని అంచనా. అయితే స్వదేశంలో పరుగులు చేసినంత మాత్రాన విదేశీ పరిస్థితుల్లోనూ రాణిస్తాడని సెలక్టర్లు భావించకపోవచ్చు. ఐపీఎల్‌ ఆడే ముందు దాదాపు మూడు నెలల విరామం ఉండటం కూడా అతడి ఫామ్‌పై ప్రభావం చూపుతుందా అన్న సందేహాలున్నాయి.

రోహిత్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడే అవకాశమూ ఉంది. అయితే దేశవాళీ వన్డే టోర్నీలో పాల్గొనడం కంటే, అక్కడి ప్రదర్శనలో స్థిరత్వం చూపించడం ముఖ్యం. ముఖ్యంగా కఠిన పరిస్థితుల్లో అతడి ఆటతీరును అంచనా వేయాల్సి ఉంటుంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు సేవలందించిన ఆటగాడికి గౌరవప్రదమైన వీడ్కోలు దక్కాలన్న అందరి ఆశ. అయితే ప్రస్తుతానికి రోహిత్‌, ఓజా మధ్య బహిరంగంగా, స్పష్టంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచకప్‌ ప్రణాళికల్లో తన స్థానం ఏంటో రోహిత్‌కు తెలియాలి. అతడి ప్రస్తుత సామర్థ్యం, భవిష్యత్తు ప్రణాళికలపై సెలక్షన్‌ కమిటీకి కూడా స్పష్టత రావాలి.

వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జింబాబ్వేతో జరగనుంది. రోహిత్‌ కెరీర్‌లో ఆ మ్యాచ్‌ కీలక మలుపుగా మారుతుందా? న్యూజిలాండ్‌ సిరీస్‌ తర్వాత ఈ ప్రశ్నకు ప్రాధాన్యం పెరిగింది.