క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నాడు. తాను తొలిసారి ఉపయోగించిన క్రికెట్ బ్యాట్‌ను 49 ఏళ్ల తర్వాత కూడా భద్రంగా దాచుకున్నానని తెలుపుతూ, సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేశాడు. తన చిన్ననాటి ఫొటోను, ఇప్పటి ఫొటోను జతచేసి పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టులో, సచిన్ చిన్నప్పుడు బ్యాటింగ్ స్టాన్స్‌లో నిలబడి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో, అలాగే, అదే బ్యాట్‌తో ఇప్పుడు మళ్లీ అదే ఫోజులో నిల్చున్న ఫొటోను జత చేశాడు. "మొదటి బ్యాట్ సంగతి ఇది. 49 ఏళ్ల తర్వాత కూడా నాతోనే ఉంది!" అంటూ హిందీలో ఒక క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సచిన్ తన వస్తువులకు ఇచ్చే విలువను చూసి మురిసిపోతున్నారు.

సరిగ్గా నవంబర్ 15న సచిన్ ఈ పోస్ట్ చేయడం మరో విశేషం. 1989లో ఇదే రోజున సచిన్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్థాన్‌తో కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్ ప్రారంభమైన రోజున, తన తొలి బ్యాట్‌ను గుర్తుచేసుకోవడం ద్వారా సచిన్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లాడు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇది తమకు కూడా పాత రోజులను గుర్తు చేసిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.