హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. నగరంలో ఘుమఘుమలాడే బిర్యానీ ధరలు అమాంతం పెరిగాయి. దాదాపు అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు ప్లేట్ బిర్యానీపై రూ. 50 వరకు ధరను పెంచేశాయి. దీంతో వీకెండ్ వచ్చినా, చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ పెంపు అదనపు భారంగా మారింది.

నగరంలో సుమారు 25,000 హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఉద్యోగాలు, చదువుల కోసం ఇక్కడ నివసించే బ్యాచిలర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా బయటి ఆహారంపైనే ఆధారపడతారు. తాజా ధరల పెంపుతో వీరి నెలవారీ బడ్జెట్‌పై రూ. 500 నుంచి రూ. 1000 వరకు అదనపు భారం పడుతుందని అంచనా. 

నగరవ్యాప్తంగా రోజుకు సుమారు 6 లక్షల బిర్యానీ ప్లేట్లు అమ్ముడవుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన, సగటున ఒక్కో ప్లేట్‌పై రూ. 30 పెరిగినా నగరవాసులపై రోజుకు రూ. 1.8 కోట్లు, నెలకు రూ. 54 కోట్ల అదనపు భారం పడుతోంది. ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లలో ఆర్డర్ చేసేవారికి డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలతో కలిపి బిల్లు మరింత పెరుగుతోంది.

అయితే, ఈ ధరల పెంపునకు బలమైన కారణాలు ఉన్నాయని హోటల్ యజమానులు వివరిస్తున్నారు. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా ముడిసరుకుల ధరలు 15% నుంచి 20% వరకు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వారు స్పష్టం చేస్తున్నారు. బిర్యానీ తయారీలో కీలకమైన నాణ్యమైన నెయ్యి ధర హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలోకు రూ. 580 నుంచి రూ. 800 దాటింది. పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా 20% వరకు పెరిగాయి.

వీటికి తోడు నిర్వహణ వ్యయాలు కూడా భారీగా పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ. 1750 ఉండగా, ఇప్పుడు రూ. 3080కి చేరింది. వంట నూనె లీటరు రూ. 150కి ఎగబాకగా, నాణ్యమైన బియ్యం కిలో రూ. 100కు చేరువైంది. చికెన్, కూరగాయల ధరలు సైతం అధికంగానే ఉంటున్నాయి. ఈ స్థాయిలో పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని తట్టుకోలేకే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తోందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న బిర్యానీ ఇప్పుడు ప్రియంగా మారింది.

లాభాలు పోయి.. నష్టాలు వస్తున్నాయి: కంచర్ల అశోక్‌ రెడ్డి  
నగరంలో హోటల్‌ బిజినెస్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కంచర్ల అశోక్‌ రెడ్డి తెలిపారు. లాభాలు పోయి.. నష్టాలు వస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముడిసరుకుల ధరలు పెరగడంతో చేసేదేం లేక కొన్ని హోటళ్లు ధరలు పెంచేశాయ‌ని వెల్ల‌డించారు. దీంతో కస్టమర్లు దూరమవుతారనే బాధ ఉందన్నారు. కానీ, పెంచకుంటే హోటళ్లు నడపలేని దుస్థితి దాపురించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.