హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లిలోని గౌతమ్ బాయ్స్ హాస్టల్‌లో నిన్న‌ అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన విక్రమ్ బాబు (19)గా గుర్తించారు. ఇతను జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అర్ధరాత్రి హాస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన విక్రమ్ బాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హాస్టల్ అధికారులు వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని, ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థి మృతితో క్యాంపస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.