వెండితెరను దశాబ్దాల పాటు ఏలిన కథానాయకులలో కృష్ణ ఒకరు. పల్లెటూరి మొనగాడు .. కార్మిక నాయకుడు .. వంటి పాత్రలలో ఆయనకి తిరుగులేదని చెప్పుకునేవారు. తెలుగు సినిమాకి మరింత భారీతనాన్ని తెచ్చిన కృష్ణ గురించి ఎవరిని అడిగినా, ఆయన దేవుడిలాంటి మనిషి అనే చెబుతారు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన అనేక విషయాలను వెల్లడిస్తారు. అలా నిర్మాత శాఖమూరి మల్లికార్జున్ 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ గురించి ప్రస్తావించారు. ఆయన గురించిన తనకి తెలిసిన విషయాలను పంచుకున్నారు. 

"అప్పట్లో కృష్ణగారు - రాఘవేంద్రరావుగారి కాంబినేషన్ అంటే ఆ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకునేవారు. అయితే దాసరి గారు అన్నాగానీ కృష్ణగారికి ఎంతో అభిమానం ఉండేది. కృష్ణగారు 'దేవదాసు' సినిమాను తీసిన సమయంలో అక్కినేనికి .. ఆయనకి మధ్య వార్ నడిచేదనే ప్రచారం జరిగింది. కానీ వాళ్లిద్దరూ ఎప్పటి మాదిరిగానే మాట్లాడుకునేవారు. ఆ తరువాత కూడా వాళ్లు కలిసి నటించారు. కృష్ణగారి కోపం ఆ గంట .. ఆ పూట మాత్రమే. ఆ తరువాత ఆ విషయాన్ని ఆయన మరిచిపోతారు" అని చెప్పారు. 

"కృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం ఉండేది కాదు. అప్పట్లోనే ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసింది కృష్ణగారే. 'గంగ మంగ' కథ విన్న తరువాత ఏ పాత్ర వేస్తారని అడిగితే, శోభన్ బాబు సెలెక్ట్ చేసుకునే పాత్ర కాకుండా మిగిలిన పాత్రను తాను చేస్తానని చెప్పారు. అలా ఆయన చాలా బోల్డ్ గా చెప్పేవారు. మనసులో ఏమీ పెట్టుకునేవారు కాదు. ఆయనకి ఎన్టీఆర్ పట్ల గౌరవం .. అక్కినేని పట్ల అభిమానం .. శోభన్ బాబుగారి పట్ల సోదర ప్రేమ ఉండేవి" అని అన్నారు.