హైదరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ కారు తీవ్ర బీభత్సం సృష్టించింది. కొత్తగా కొనుగోలు చేసిన కారు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న వాహనాలను, కూరగాయల బండిని ఢీకొడుతూ సమీపంలోని ఓ మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఊహించని ప్రమాదంలో కూరగాయలు విక్రయించుకునే ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల కథనం ప్రకారం.. రాంనగర్ కమాన్ వైపు నుంచి స్థానిక దేవాలయం వైపు వెళుతున్న కొత్త కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అతివేగంతో ముందుకు దూసుకొచ్చిన ఆ వాహనం, తొలుత రోడ్డు పక్కన నిలిపి ఉంచిన పలు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది. అనంతరం సమీపంలోని కూరగాయల బండిపైకి దూసుకెళ్లి, చివరకు పక్కనే ఉన్న ఓ మెడికల్ షాపులోకి చొచ్చుకెళ్లి ఆగింది.

ప్రమాదం జరిగిన సమయంలో మెడికల్ షాపు మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, కూరగాయల బండి వద్ద వ్యాపారం చేసుకుంటున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడానికి గల అసలు కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమా, సాంకేతిక లోపమా లేక డ్రైవింగ్ వైఫల్యమా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.