దిగ్గజ వ్యాపార సంస్థ టీవీఎస్ గ్రూప్‌లోని వేణు శ్రీనివాసన్ కుటుంబంలో అంతర్గత ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది. ఉమ్మడి కుటుంబ ఆస్తులను చట్టబద్ధంగా విభజించి, తనకు రావాల్సిన సమాన వాటాను ఇవ్వాలని కోరుతూ ఆయన కుమార్తె లక్ష్మీ వేణు లీగల్ నోటీసు పంపారు. టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్‌కు ఆమె ఈ విభజన నోటీసును అందజేశారు.

ఏఎన్ఐ కథనం ప్రకారం... హిందూ వారసత్వ చట్టం 1956 (2005 సవరణ) ప్రకారం కుమార్తెగా తనకు ఉమ్మడి కుటుంబ ఆస్తిలో సమాన హక్కు ఉందని లక్ష్మీ వేణు స్పష్టం చేశారు. కుటుంబ పెద్దగా తండ్రి వేణు శ్రీనివాసన్ తన బాధ్యతలను నిర్వర్తించి, న్యాయమైన రీతిలో ఆస్తుల విభజన చేపట్టాలని ఆమె కోరారు. 2020లో టీవీఎస్ గ్రూప్‌లో కుదిరిన విస్తృత కుటుంబ ఒప్పందం ద్వారా వీఎస్ ట్రస్ట్, ఇతర హోల్డింగ్ సంస్థల పరిధిలోకి వచ్చిన ఆస్తులను ఆమె ఈ నోటీసులో ప్రస్తావించారు. వీటిలో టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం-క్లేటన్ సంస్థల్లోని వాటాలు ఉన్నాయి.

2020 నాటి ఒప్పందం అనేది కేవలం గ్రూప్ పరమైనదేనని, తమ కుటుంబం లోపల ఎలాంటి అంతర్గత ఆస్తి పంపకాలు జరగలేదని లక్ష్మి పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణ లేదా నియంత్రణ అధికారం ఉన్నంత మాత్రాన అది పూర్తి యాజమాన్య హక్కు కాబోదని ఆమె స్పష్టం చేశారు. ప్రయోజనాలన్నీ తన సోదరుడు సుదర్శన్ వేణుకే దక్కేలా చేశారని, తనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆమె ఆరోపించారు. పితృస్వామ్య భావాలతోనో లేదా ఏకపక్ష కార్పొరేట్ నిర్ణయాలతోనో కుమార్తెల చట్టబద్ధమైన హక్కులను కాలరాయలేరని ఆమె స్పష్టం చేశారు. కాగా, లక్ష్మీ వేణు లేవనెత్తిన ఈ డిమాండ్‌కు ఆమె తల్లి మల్లికా శ్రీనివాసన్ కూడా పూర్తి మద్దతు ప్రకటించడంతో ఈ వివాదం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.