రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో మూడు నాలుగేళ్ల పాటు కొనసాగాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఆకాంక్షించాడు. ప్రస్తుతం కోహ్లీ తన కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో అత్యంత సంతృప్తికరమైన, అద్భుతమైన స్థితిలో ఉన్నాడని పేర్కొన్నాడు. క్రిక్‌ఇన్‌ఫో నిర్వహించిన 'క్రికెటర్స్ ఆన్ క్రికెటర్స్' కార్యక్రమంలో డుప్లెసిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో అతడు 16 మ్యాచ్‌లలో 56.25 సగటుతో, 165.85 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 675 పరుగులు సాధించి సత్తా చాటాడు. కోహ్లీ ప్రస్తుత ఆటతీరు, ఫిట్‌నెస్‌పై డుప్లెసిస్ మాట్లాడుతూ.. "విరాట్ ప్రస్తుతం చాలా ప్రశాంతమైన దశలో ఉన్నాడు. అతనికి చక్కని కుటుంబం ఉంది. భార్య అనుష్క శర్మ ప్రభావం అతడి జీవితంలో ఎంతో సానుకూలంగా పనిచేసింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆటకు కాస్త విరామమిచ్చి, పూర్తిగా రిఫ్రెష్ అయి తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ విధానం వల్ల అతడు ఐపీఎల్‌లో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. గతంలో ఏబీ డివిలియర్స్ విషయంలోనూ ఇలాగే అనుకున్నాం. కోహ్లీ లాంటి అద్భుతమైన ఆటగాళ్లు త్వరగా ఆటకు వీడ్కోలు పలకకూడదు" అని పేర్కొన్నాడు.

అంతేకాకుండా, కోహ్లీ ఒకవేళ మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు వరుసగా ఆడుతూ ఉంటే అలసటకు గురయ్యేవాడని, అయితే ప్రస్తుత పరిస్థితి అతడికి ఎంతో మేలు చేస్తోందని డుప్లెసిస్ విశ్లేషించాడు. "కోహ్లీ ఆర్సీబీని ఎంతగానో ప్రేమిస్తాడు. జట్టు కోసం సర్వస్వం ధారపోస్తాడు. టీమిండియా కోసం కూడా అంతే అంకితభావంతో ఆడతాడు. ఇప్పుడు జట్టు మరోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో, అతడు ఆర్సీబీ తరఫున కనీసం మరో మూడు లేదా నాలుగేళ్లు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను" అని స్పష్టం చేశాడు.

చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసిన క్షణాలను డుప్లెసిస్ గుర్తు చేసుకున్నారు. "నేను బ్యాటింగ్ చేసిన వారిలో విరాట్ నాకు అత్యంత ఇష్టమైన పార్ట్‌నర్. అతడితో కలిసి ఆడుతున్నప్పుడు మైదానంలో విద్యుత్ ప్రవహించినట్లే ఉంటుంది. ఏబీ డివిలియర్స్‌లో చూసిన తీవ్రతే ఇక్కడా కనిపిస్తుంది. కోహ్లీతో క్రీజులో ఉన్నప్పుడు మనలో తీవ్రత 100 శాతం ఉండాల్సిందే. నేను బౌండరీ బాదిన ప్రతిసారీ ఎంతో ఉత్సాహంతో అతడి చేతికి గట్టిగా పంచ్ ఇచ్చేవాడిని. స్టేడియంలోని ప్రేక్షకులు, కోహ్లీ ఇచ్చే జోష్ అనుభవించడం నా కెరీర్‌లోనే ఒక గొప్ప జ్ఞాపకం. క్రికెట్ దిగ్గజంతో కలిసి ఆడటం, కెప్టెన్‌గా వ్యూహాలు పంచుకోవడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన ఘట్టం" అని డుప్లెసిస్ వివరించాడు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్.. 2008 నాటి తొలి ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీతో ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. "అండర్-19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత 18 ఏళ్ల వయసులో విరాట్ ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పుడు అతడిని తొలిసారి కలిశాను. అప్పట్లో కోహ్లీకి ఇప్పుడున్నంత ఫిట్‌నెస్ లేదు, బుగ్గలు కాస్త బొద్దుగా ఉండేవి. సాధారణ టీషర్ట్, షార్ట్స్, చెప్పులతో ఉండే కుర్రాడు. కానీ, అతడిలో విపరీతమైన ఉత్సాహం కనిపించేది. అప్పట్లో అతడికి కాస్త సరైన దిశానిర్దేశం అవసరమైనప్పటికీ, ఆట పరంగా అతడెంత ప్రతిభావంతుడో ఆనాడే స్పష్టంగా అర్థమైంది" అని స్టెయిన్ తెలిపాడు.