వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలంగాణకు చెందిన 73 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ నిరూపించారు. దశాబ్దం క్రితం గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నప్పటికీ, ఆయన అంతర్జాతీయ వేదికపై రెండు పతకాలు సాధించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భద్రాచలానికి చెందిన డి.వి. శంకర్ రావు ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని రెనో నగరంలో ఇటీవల ఐపీఎఫ్ వరల్డ్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఇందులో మాస్టర్స్- 4, 74 కిలోల విభాగంలో శంకర్‌రావు పోటీ పడ్డారు. అక్టోబర్ 15న జరిగిన క్లాసిక్ డివిజన్‌లో కాంస్య పతకం గెలుచుకోగా, అక్టోబర్ 22న జరిగిన ఈక్విప్డ్ డివిజన్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేసిన శంకర్‌రావు, 2012లో తన 59వ ఏట బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. పదవీ విరమణ పొందిన అనంతరం, ఒక స్నేహితుడి ప్రోత్సాహంతో వైద్యుల సూచనలు పాటిస్తూ జిమ్‌లో శిక్షణ ప్రారంభించారు. అనతికాలంలోనే జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించిన ఆయన, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటారు.

"73 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి, రెండు పతకాలు అందుకోవడం మర్చిపోలేని అనుభూతి" అని శంకర్‌రావు  పేర్కొన్నారు. ఆయన విజయాన్ని 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట‌రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వచ్చే పర్యాయం స్వర్ణ పతకం సాధించి, ప్రపంచ వేదికపై మన జాతీయ గీతం మారుమోగేలా చేయడమే తన లక్ష్యమని శంకర్‌రావు వెల్లడించారు.