‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలుకుతూ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. నేడు హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య తేజ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని, రానా, రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వచ్చే డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తేజ వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుకను కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్రైవేట్‌గా నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లో స్నేహితులు, సినీ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, తేజ వివాహం చేసుకోబోయే అమ్మాయి వివరాలను గోప్యంగా ఉంచారు. ఆమె అమెరికాలో పెరిగారని, ఐటీ రంగంలో వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని సమాచారం.

ఇక సినిమాల విషయానికొస్తే, ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి విజయాల తర్వాత తేజ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన గతంలో నటించిన ‘జాంబిరెడ్డి’ సినిమాకు సీక్వెల్‌తో పాటు ‘హనుమాన్’ సీక్వెల్‌లోనూ నటించనున్నారు.