కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) పరీక్ష రాసే విద్యార్థులు జంధ్యం (యజ్ఞోపవీతం) ధరించడంపై తమ నిబంధనల్లో ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక పరీక్షల ప్రాధికార సంస్థ (కేఈఏ) రాష్ట్ర హైకోర్టుకు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల నుంచి జంధ్యాన్ని బలవంతంగా తొలగించేలా ఎలాంటి మార్గదర్శకాలు లేవని కేఈఏ ఉన్నత న్యాయస్థానానికి వివరించింది.

గత 2025 పరీక్షల సమయంలో కొందరు విద్యార్థుల జంధ్యాలు తొలగించిన కొన్ని సంఘటనలను నిరసిస్తూ ‘అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ’ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అను శివరామన్, జస్టిస్ కేఎస్ భరత్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

ఈ విచారణ సందర్భంగా కేఈఏ తరఫున అధికారులు కోర్టుకు కీలక వివరాలు సమర్పించారు. విద్యార్థులు జంధ్యం తీసివేయాలనే నిబంధనలు పరీక్షా మార్గదర్శకాల్లో ఎక్కడా లేవని తెలిపారు. గత 2025–26 సీఈటీ సమయంలో అక్కడక్కడా జరిగిన ఒకటీ రెండు ఘటనలపై ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కేఈఏ తెలిపింది.

అలాగే, ఈ ఘటనలపై కర్ణాటక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, కర్ణాటక బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా వివరణ కోరాయని, వీటికి సంబంధించి తాము తీసుకున్న చర్యల సమగ్ర నివేదికను (స్టేటస్ రిపోర్ట్) ఇప్పటికే ఆయా కమిషన్లకు సమర్పించామని కేఈఏ కోర్టుకు వెల్లడించింది.

కేఈఏ సమర్పించిన ఈ వివరాలను, ఇచ్చిన హామీలను రికార్డుల్లోకి తీసుకున్న హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈ పిటిషన్‌ను పరిష్కరించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలను ఒకే రీతిలో, క్రమశిక్షణతో మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు జారీ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.