సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసకర‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. న్యూ చండీగఢ్‌లో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 135 పరుగులు బాదాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా మధ్యప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ ఇన్నింగ్స్‌లో రజత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొత్తం 13 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ తరఫున సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఒకే ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు బాది, రాష్ట్రం తరఫున ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగానూ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

మధ్యప్రదేశ్ జట్టు 8వ ఓవర్లో 57 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు రజత్ క్రీజులోకి వచ్చాడు. ఏమాత్రం సమయం తీసుకోకుండా అస్సాం బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మూడో నంబర్‌లో వచ్చిన శివాంగ్ కుమార్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి కేవలం 62 బంతుల్లోనే 153 పరుగులు జోడించారు. ఇది ఈ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు రెండో అత్యధిక భాగస్వామ్యం. తన ఇన్నింగ్స్ మొత్తంలో రజత్ కేవలం ఐదు డాట్ బాల్స్ మాత్రమే ఆడటం అతని దూకుడుకు నిదర్శనం.

ఇటీవల గాయాల కారణంగా 50 ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న రజత్, ఈ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నవంబర్ 19 నుంచి 29 వరకు దోహాలో జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ప్రకటించిన ఇండియా 'ఏ' జట్టుకు తొలుత వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, ఆ జట్టు నుంచి తాను తప్పుకుంటున్నట్లు బీసీసీఐకి తెలియజేశాడు. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో అతను ఇంతటి విధ్వంసకర‌ ఇన్నింగ్స్ ఆడటం ప్రాధాన్యం సంతరించుకుంది.