వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేయనున్న నూతన రాజకీయ పార్టీలో తాను చేరుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.

విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయభాస్కర్ రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిపై, పార్టీ అంతర్గత పనితీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు లేని చోట ఉండలేమని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీ వ్యవస్థాగత తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. "వైసీపీలో ఎవరికీ సభ్యత్వాలు ఉండవు. సంతకాలు లేని లెటర్ ప్యాడ్స్‌పై పదవులు ఇస్తారు" అని విజయభాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ వమ్ము చేసుకున్నారని ఆరోపించారు. కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరని అన్నారు.  గుర్తింపు లేదనే మనస్తాపంతో ఆ పార్టీని వీడి, విజయసాయిరెడ్డి పెట్టనున్న పార్టీలో చేరుతున్నానని తెలిపారు.

విజయవాడలో వంగవీటి రాధా, గుంటూరులో కూటమి గెలుపునకు వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులే కారణమని విజయభాస్కర్ రెడ్డి అన్నారు. 

విజయసాయిరెడ్డి నవంబర్ 11న (రేపు) ఉదయం 11:11 గంటలకు విజయవాడ వేదికగా తన కొత్త పార్టీని లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి ఆయనకు మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.