రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయని, అప్పుడు కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన తన కుమారుడు హర్షిత్ రెడ్డి సాధించిన విజయంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార కూటమి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు తమ పక్షానే నిలిచారని, సీఎం చంద్రబాబు సొంత ప్రాంతంలో వైసీపీ తన జెండాను రెపరెపలాడించిందని ఆయన పేర్కొన్నారు.

తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో, సమీప టీడీపీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మిపై హర్షిత్ రెడ్డి 602 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో హర్షిత్ రెడ్డికి 41,119 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ధనలక్ష్మి 40,517 ఓట్లు సాధించారు. ఇక పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి 177 ఓట్లు, టీడీపీకి 216 ఓట్లు లభించాయి. ఫలితం వెలువడటంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నామినేషన్ల దశ నుంచే ప్రత్యర్థులు తీవ్రమైన దాడులు, బెదిరింపులకు తెగబడ్డారని ఆరోపించారు. చివరికి ఫలితం స్పష్టమై, గెలుపు ఖరారైన తర్వాత కూడా అధికారుల నుంచి డిక్లరేషన్ ఇప్పించడంలో తీవ్ర జాప్యం చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తాము ఇప్పటికే మూడు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నామని వివరించారు.

మిగిలిన మూడు మండలాల్లో ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని ఆరోపించిన చెవిరెడ్డి, అక్కడ రీపోలింగ్ నిర్వహించే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నప్పటికీ ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థిని ఆశీర్వదించిన తిరుపతి రూరల్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.