ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో జగన్ ఈరోజు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలపై నేతలతో ఆయన చర్చించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... "చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజలంతా చూశారని, వాస్తవాలను ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారని" పేర్కొన్నారు. ఎన్నికలు ఏమాత్రం సజావుగా జరిగి ఉన్నా వైసీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యేదని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నామినేషన్లు, పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అడ్డంకులు సృష్టించి అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు.

అన్ని రకాల అవకతవకలు, దాడులు జరిగినప్పటికీ వైసీపీకి ప్రజా మద్దతు తగ్గలేదని జగన్ స్పష్టం చేశారు. "2024 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం పెరిగింది" అని ఆయన వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు చోటుచేసుకున్నప్పటికీ పార్టీ ఓటింగ్ శాతం పెరగడం వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు స్పష్టమైన నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించిన నేతలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.