తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ వివాహేతర సంబంధం గురించి ఇంట్లో చెబుతాన‌ని బెదిరించినందుకు గాను 19 ఏళ్ల యువతి, 14 ఏళ్ల బాలుడు కలిసి 15 ఏళ్ల పదో తరగతి విద్యార్థిని విషం పెట్టి చంపేశారు. చికిత్స పొందుతూ 18 రోజుల తర్వాత బాధితుడు మృతి చెందడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కల్లూరు ప్రాంతానికి చెందిన జిల్లేల రవి (15) అనే బాలుడు సత్తుపల్లిలో పదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు తన సొంత గ్రామానికి వచ్చాడు. అదే గ్రామంలో, తన భర్త నుంచి ఆరు నెలలుగా దూరంగా ఉంటున్న అపర్ణ (19) అనే యువతి తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు స్థానికంగా ఉండే 14 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది.

అక్టోబర్ 20న అపర్ణ, మైనర్ బాలుడు ఏకాంతంగా ఉండగా రవి చూశాడు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు చెబుతానని హెచ్చరించాడు. దీంతో భయపడిన ఆ ఇద్దరూ రవిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం అక్టోబర్ 21న మైనర్ బాలుడు, రవిని ఊరి చివరకు తీసుకెళ్లి కలుపు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు.

కూల్ డ్రింక్ తాగిన వెంటనే రవి గొంతులో మంట, నోటిలో పొక్కులు వంటి లక్షణాలు కనిపించాయి. నిందితులను నిలదీయగా విషం కలిపినట్లు అంగీకరించడంతో రవి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. వారు వెంటనే అతడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల‌ 8న రవి మృతి చెందాడు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కల్లూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. యువతిని సత్తుపల్లి సబ్-జైలుకు, మైనర్ బాలుడిని వరంగల్‌లోని జువైనల్ హోంకు పంపించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.