శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థితో, అతని సహచర విద్యార్థులే బలవంతంగా పురుగుల మందు తాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. సంగం గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి, పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇద్దరు సహచర విద్యార్థులు తనతో బలవంతంగా పురుగుల మందు తాగించారని బాధితుడు తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం బయటపడింది. వెంటనే బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అక్టోబర్ నెలాఖరులో జరిగినట్లు తెలుస్తోంది.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా పోలీసులు ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.