ఐపీఎల్‌లో కీలక ఆటగాళ్ల ట్రేడింగ్‌ వ్యవహారం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌ జట్టులోకి మారనున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు బలమైన సందేశం పంపించాడు. కెప్టెన్‌ శ్రేయస్‌, కోచ్‌ రికీ పాంటింగ్‌ సహా పంజాబ్‌ జట్టు మొత్తానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశాడు. పంజాబ్‌ జెర్సీతో ఉన్న ఫొటోను కూడా పంచుకున్నాడు.

రెండుసార్లు ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన పంజాబ్‌ కింగ్స్‌తో కలిసి పనిచేయడం పట్ల హార్దిక్‌ ఉత్సాహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నా కెప్టెన్‌ శ్రేయస్‌.. నా కోచ్‌ రికీ.. నా జట్టు.. పంజాబ్‌ మొత్తం.. మీ వెనక నేనున్నా’ అంటూ పోస్ట్‌ చేశాడు. తన ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలతో జట్టుకు ఉపయోగపడతాననే సంకేతాలిచ్చాడు.

ఐపీఎల్‌ చరిత్రలోనే కీలకమైన ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌కు హార్దిక్‌ వెళ్లనున్నాడు. అతడి స్థానంలో భారత టీ20 బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ముంబై ఇండియన్స్‌లో చేరనున్నాడు. ఈ ట్రేడింగ్‌లో హార్దిక్‌ పారితోషికం రూ.16.35 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరగనుంది. అర్ష్‌దీప్‌ మాత్రం తన ప్రస్తుత రూ.18 కోట్ల పారితోషికంతోనే ముంబై జట్టుకు మారనున్నాడు.

హార్దిక్‌కు ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2015లో ఆ జట్టులో చేరిన అతడు 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిళ్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఏడు సీజన్ల తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌కు మారి, తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా టైటిల్‌ అందించాడు. 2023లోనూ ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2024లో తిరిగి ముంబైకి వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

మొత్తం 162 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో హార్దిక్‌ 2,955 పరుగులు చేయడంతోపాటు 82 వికెట్లు పడగొట్టాడు. అయితే ముంబైతో రెండో విడత మూడేళ్ల ప్రయాణంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 39 మ్యాచ్‌ల్లో 647 పరుగులు, 29 వికెట్లు సాధించాడు. అతడి కెప్టెన్సీలో ముంబై 2025లో ప్లేఆఫ్స్‌కు చేరగా, 2024, 2026 సీజన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

మరోవైపు అర్ష్‌దీప్‌ 2019లో పంజాబ్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఆ జట్టు తరఫున 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2025 సీజన్‌లో 21 వికెట్లు, 2026లో 14 వికెట్లు పడగొట్టాడు. కొత్త బంతితో వికెట్లు తీయడంతోపాటు డెత్‌ ఓవర్లలోనూ బౌలింగ్‌ చేయగల సామర్థ్యం అతడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.