దాతృత్వం పేరుతో కాసుల వసూళ్లకు తెరలేపారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సాయం చేస్తున్నట్లు నమ్మించి, నకిలీ క్యూఆర్‌ కోడ్‌తో విరాళాలు వసూలు చేసిన ఘటన కేరళలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కేరళలోని మంపట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ లక్ష్మీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌పై ముక్కం పోలీసులు కేసు నమోదు చేశారు. స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల పేర్లతో నకిలీ క్యూఆర్‌ కోడ్‌ సృష్టించి డబ్బులు వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 318 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విరాళాల సేకరణకు ఉపయోగించినట్లు భావిస్తున్న క్యూఆర్‌ కోడ్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాను నిలిపివేశారు. ఈ విషయాన్ని ముక్కం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్మల్‌ వెల్లడించారు. వసూలైన నగదు ఇతర ఖాతాలకు బదిలీ అయిందా? ఈ మోసానికి ఇంకా ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోసానికి ఉపయోగించిన ఇతర మార్గాలపైనా ఆరా తీస్తున్నారు.

ఎస్‌ఎంఏ బాధిత చిన్నారులకు సాయం చేసేందుకు ఏర్పాటైన కమిటీ ప్రతినిధులు పోలీసుల చర్యను స్వాగతించారు. సకాలంలో కేసు నమోదు చేయడం వల్ల ఇలాంటి మోసాలను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. సంబంధిత కమిటీలకు తెలియకుండా, వాటి అనుమతి లేకుండా చేసే విరాళాల సేకరణకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల పేర్లతో వచ్చే విరాళాల అభ్యర్థనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. డబ్బులు పంపే ముందు ప్రచారం నిజమైనదో? కాదో? నిర్ధారించుకోవాలని సూచించారు. అనుమానాస్పద విరాళాల సేకరణ లేదా లావాదేవీలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.