రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలపై నిషేధం విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల కొన్ని కళాశాలల్లో జరిగిన ప్రమాదాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యార్థుల భద్రతను గాలికొదిలి, యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కఠినమైన మార్గదర్శకాలు తీసుకురావాలని నిర్ణయించింది.

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా నిర్వహించిన దాండియా కార్యక్రమంలో ఒక విద్యార్థిని మరణించగా, పలువురు గాయపడ్డారు. మరో ప్రైవేట్ వర్సిటీలో జరిగిన సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లోనూ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, విద్యా ప్రాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. క్యాంపస్‌లను కేవలం విద్య, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి. సినిమా ప్రమోషన్లు, ఇతర వాణిజ్య కార్యక్రమాలను పూర్తిగా నిషేధించనున్నారు. ఒకవేళ పెద్ద ఎత్తున క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే, హాజరయ్యే వారి సంఖ్య, భద్రతా ఏర్పాట్ల గురించి ముందుగానే పోలీసు, అగ్నిమాపక శాఖలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థల యాజమాన్యాలపై భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నారు.

కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల భద్రతను విస్మరించి, వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ సైతం విద్యార్థుల భద్రతపై ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.