క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తన కెరీర్‌లో ఉపయోగించిన 26 బ్యాట్లను ముంబై క్రికెట్‌ సంఘానికి (ఎంసీఏ) బహుమతిగా ఇవ్వనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో చారిత్రక ఘనతలు సాధించేందుకు ఉపయోగించిన బ్యాట్లతో పాటు హెల్మెట్లు, జెర్సీలు, కీలక సందర్భాలకు సంబంధించిన వ్యక్తిగత నోట్లను కూడా ఎంసీఏకు అందించనున్నారు. వీటిని ముంబైలోని శరద్‌ పవార్‌ క్రికెట్‌ మ్యూజియంలో ప్రత్యేక విభాగంలో ప్రదర్శించనున్నారు. ‘బ్యాటోగ్రఫీ’ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనను నవంబర్‌ 16న ప్రారంభించనున్నారు.

సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రదర్శనను ప్రారంభించడం విశేషం. 2013 నవంబర్‌లో ముంబై వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో తన 200వ టెస్టు ఆడిన సచిన్‌.. అదే మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికారు.

సచిన్‌ క్రికెట్‌ ప్రయాణాన్ని ఆయన ఉపయోగించిన బ్యాట్ల ద్వారా పరిచయం చేయడమే ‘బ్యాటోగ్రఫీ’ ఉద్దేశం. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన చారిత్రక ఘనతకు తోడ్పడిన బ్యాట్లు కూడా ఇందులో ఉండనున్నాయి. వాటి వెనుక ఉన్న విశేషాలను తెలుసుకునే అవకాశం అభిమానులకు లభించనుంది.

ఈ కార్యక్రమంపై ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్‌ మాట్లాడుతూ.. భారత, ప్రపంచ క్రికెట్‌కు సచిన్‌ అందించిన సేవలు రికార్డులకు మాత్రమే పరిమితం కావని అన్నారు. కోట్లాది మంది అభిమానుల జ్ఞాపకాల్లో ఆయన ప్రయాణం భాగమైందని పేర్కొన్నారు. సచిన్‌ తన విలువైన జ్ఞాపికలను మ్యూజియానికి అందించడం గౌరవంగా భావిస్తున్నామని, తద్వారా భవిష్యత్‌ తరాల క్రికెట్‌ అభిమానులు ఆయన ఘనతలను మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా సచిన్‌ కెరీర్‌లోని కీలక ఘట్టాలను, వాటితో ముడిపడిన జ్ఞాపకాలను భద్రపరచడంతో పాటు అభిమానులకు వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలగనుంది.