ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇది ఒక చీకటి రోజు అని అన్నారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడాకులు తీసుకోవడం వారి వ్యక్తిగత విషయమే అయినప్పటికీ, సమాజాన్ని అమితంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న నాయకుడు కావడంతోనే తాను స్పందించాల్సి వస్తోందని తులసిరెడ్డి అన్నారు.

పవన్ కల్యాణ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సమాజంపై, ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపే నాయకుడని తులసిరెడ్డి పేర్కొన్నారు. సాధారణ వ్యక్తులైతే ఎవరూ స్పందించరని, కానీ ఇంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు తీసుకునే నిర్ణయాలు సమాజంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతపై ఈ పరిణామాలు ఎలాంటి ముద్ర వేస్తాయో ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హిందూ సనాతన ధర్మంలో వివాహ బంధం అత్యంత పవిత్రమైనదని తులసిరెడ్డి గుర్తుచేశారు. పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో వధువుకు, ఆమె తల్లిదండ్రులకు జీవితాంతం అంకితమై ఉంటానని వరుడు అగ్నిసాక్షిగా వేద ప్రమాణం చేస్తాడని తెలిపారు. మూడు ముళ్లు, ఏడడుగుల బంధం అత్యంత పవిత్రమైనవని చెప్పారు. అలాంటి పవిత్రమైన వేద ప్రమాణానికి పవన్ కల్యాణ్ చర్య భంగం కలిగిస్తోందని ఆయన అన్నారు. పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా, ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉంటామని చెబుతున్నప్పుడు, మంచి భార్యాభర్తలుగా ఎందుకు కలిసి ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ చర్యను సమాజం ఎప్పటికీ హర్షించదని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో కూటమికి కూడా విడాకులు తప్పవేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తులసిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీశాయి.