విశాఖపట్నం విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటివరకు ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ హోదాను రద్దు చేసింది. ఈ మేరకు విశాఖను 'అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్' జాబితా నుంచి డీనోటిఫై చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ సేవలు కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొనసాగుతాయని స్పష్టం చేసింది.

కొత్తగా ప్రారంభమైన భోగాపురం విమానాశ్రయానికి పూర్తిస్థాయిలో పౌర విమానయాన కార్యకలాపాలు మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇకపై అంతర్జాతీయ విమానాల రాకపోకలు, ప్రయాణికుల ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తిగా భోగాపురం కేంద్రంగానే జరుగుతాయి. వాస్తవానికి పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఏడాది ఆగస్టు 17 నుంచే నిలిచిపోయిన విషయం తెలిసిందే.

కాగా, విశాఖ నగరం నుంచి ప్రయాణించే వారికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు అదనపు ప్రయాణ సమయం, దూరం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొత్త విమానాశ్రయంలో మెరుగైన సౌకర్యాలు, పెరిగిన అంతర్జాతీయ కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం గత జూలైలోనే భోగాపురం విమానాశ్రయాన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా గుర్తిస్తూ నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న చెక్‌పోస్ట్‌ల జాబితాలో దీన్ని 39వదిగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతితో పాటు ఇప్పుడు భోగాపురం ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా సేవలందించనుంది.