ముంబై సబర్బన్ రైలు ప్రయాణికుల భద్రత దిశగా రైల్వే శాఖ ఒక కీలక ముందడుగు వేసింది. ఆటోమేటిక్ డోర్లతో కూడిన మొట్టమొదటి నాన్-ఏసీ లోకల్ రైలును భద్రతా పరీక్షల కోసం ముంబైకి పంపింది. 12 కోచ్‌లు ఉన్న ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) తయారు చేసింది. సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌లో వివిధ సెక్షన్లలో దీని భద్రత, కార్యాచరణ సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి తీసుకురావడంపై నిర్ణయం తీసుకుంటారు.

గతేడాది జూన్ లో ముంబ్రా సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఈ కొత్త రైలు రూపకల్పనకు ప్రధాన కారణంగా నిలిచింది. ఆ ప్రమాదంలో రద్దీగా ఉన్న రైలు నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మరణించడంతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నాన్-ఏసీ లోకల్ రైళ్లకు కూడా ఆటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2026 నాటికి వీటిని ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును వేగవంతం చేశారు.

ఈ రైలులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రైలు కదులుతున్నప్పుడు డోర్లు వాటంతట అవే మూసుకుంటాయి, కేవలం రైల్వే స్టేషన్లలో ఆగినప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి. ఇది నాన్-ఏసీ రైలు కావడంతో కోచ్‌లలో గాలి ప్రసరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డోర్లకు ప్రత్యేక లూవర్డ్ ప్యానెళ్లు, రైలు పైకప్పుకు వెంటిలేటర్లు అమర్చారు. వీటితో పాటు సీసీటీవీ కెమెరాలు, అగ్నిప్రమాద హెచ్చరిక వ్యవస్థ, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడేందుకు కమ్యూనికేషన్ సదుపాయం వంటి అదనపు భద్రతా ఫీచర్లను కూడా చేర్చారు.

ఈ రైలుకు ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని ఖజురహో-మహోబా సెక్షన్‌లో (63 కి.మీ.) ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ముంబైలో జరగనున్న విస్తృత ట్రయల్స్ నివేదికలను అధికారులు సమీక్షిస్తారు. అన్ని పరీక్షలలో విజయవంతమై, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందిన తర్వాతే ఈ రైలును ప్రయాణికుల సేవలకు అనుమతించనున్నారు.