ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) పేరుతో నూతన రాజకీయ వేదికను అధికారికంగా ప్రారంభించారు.

పార్టీ ఆవిర్భావం అనంతరం విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "రాష్ట్రాన్ని కేవలం రెండు కుటుంబాలే పరిపాలించాలా? ఆ రెండు కుటుంబాలే ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను శాసించాలా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆ కుటుంబాల నుంచే సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రావాలా? అని నిలదీశారు. అన్ని కులాల్లో నాయకులు ఉంటారని... అలాంటి వారికి పీఆర్పీ వేదికగా ఉంటుందని చెప్పారు.

ఏపీ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతుల్లోనూ లేదని, అది కేవలం ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. మార్పును ప్రజలే స్వయంగా తీసుకురావాలని ఆకాంక్షించారు. ఓటు వేయడంతోనే బాధ్యత అయిపోదని... ప్రజాస్వామ్యంలో అసలైన పాత్ర అక్కడి నుంచే ప్రారంభమవుతుందని అన్నారు. అధికార, ప్రతిపక్షాల ఆత్మస్థుతి, రాజకీయ విమర్శలతో... అసలైన నిజాలు, లెక్కలు, ప్రజల ప్రాథమిక అవసరాలు కనుమరుగు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు తప్పుచేసినా... అది నేనైనా, చంద్రబాబైనా, జగన్ అయినా ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కు అని అన్నారు.

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని, ప్రజల అవసరాలు, నిజాలు పాలకులకు కనిపించడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని, ఆ గళాన్ని వినిపించడమే తమ ఉద్దేశమన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలను వెలికితీసి, కొత్త తరం నాయకులను తయారు చేయడమే పీఆర్పీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ‘జనం కోసం.. జన హితం కోసం’ అనే నినాదంతో ముందుకు సాగుతామని వెల్లడించారు. పార్టీ సమగ్ర విధానాలు, సంస్థాగత నిర్మాణాన్ని త్వరలోనే ప్రకటిస్తామని, ప్రజలతో మమేకమయ్యేందుకు రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడతామని ఆయన స్పష్టం చేశారు.