ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం సరికొత్త పుంతలు తొక్కుతోందని, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం, ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలపై నమ్మకంతో దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బారులు తీరుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

గత వైసీపీ పాలనలో తీసుకున్న విధ్వంసకర నిర్ణయాలు, పారిశ్రామికవేత్తలపై వేధింపుల కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గంటా విమర్శించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లడంతో జగన్ హయాంలో దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయని ఆరోపించారు. ఆ ఐదేళ్ల కాలంలో కేవలం ఒకే ఒక్క పెట్టుబడుల సదస్సును మొక్కుబడిగా నిర్వహించారని గుర్తుచేశారు. 

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రెండుసార్లు సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులను విజయవంతంగా నిర్వహించి, ఏకంగా రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించిందని గణాంకాలతో వివరించారు. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని గంటా తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 8 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన దిశగా కీలక ముందడుగు పడిందన్నారు. దేశంలోనే అత్యుత్తమమైన 28 నూతన పారిశ్రామిక విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోందని పేర్కొన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి నెలా ఒక భారీ పరిశ్రమ రావడం, భూమిపూజ లేదా ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగడం పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని చెప్పారు. సీఐఐ ప్రాంతీయ సదస్సుల ద్వారా మరో 1.50 లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైందని ఆయన తెలిపారు.

విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర పారిశ్రామిక ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలవనుందని గంటా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని భారీ ప్రాజెక్టులు రానున్నాయని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. 

పారిశ్రామిక అభివృద్ధి సాధించడం, యువతకు ఉపాధి కల్పించడం, పెట్టుబడిదారులకు పూర్తి భరోసా ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.