చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బీవైడీకి, బ్రిటన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌)కు మధ్య న్యాయపోరు మొదలైంది. బీవైడీ రూపొందించిన టీ7 ఎస్‌యూవీలో తమ ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ సాంకేతికతను అక్రమంగా ఉపయోగించారని జేఎల్‌ఆర్‌ ఆరోపించింది. డిఫెండర్‌ వాహనాన్ని విడదీసి, దాని సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి టీ7లో వినియోగించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం నెదర్లాండ్స్‌లోని హేగ్‌ కోర్టు పరిధిలో ఉంది.

ఈ ఏడాది ఆగస్టులో కోర్టు ఆదేశాలతో అధికారులు నెదర్లాండ్స్‌లోని షీడామ్‌, హూఫ్‌డార్ప్‌ ప్రాంతాల్లో ఉన్న బీవైడీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అక్కడి డిజిటల్‌ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కీలక ఆధారాలు తొలగించకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టాలని కోరినట్లు జేఎల్‌ఆర్‌ తెలిపింది. ఈ కేసులో ప్రాథమిక విచారణపై నవంబర్‌ 11న కోర్టు నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

కోర్టు చర్యను బీవైడీ న్యాయవాదులు ‘ఫిషింగ్‌ ఎక్స్‌పెడిషన్‌’గా అభివర్ణించారు. అవసరానికి మించి పెద్ద సంఖ్యలో ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారని వాదించారు. అయితే విచారణ ప్రక్రియకు బీవైడీ అడ్డంకులు సృష్టిస్తోందని జేఎల్‌ఆర్‌ తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఈ కేసు విచారణలో ఉండటంతో రెండు సంస్థలూ బహిరంగంగా స్పందించలేదు.

బీవైడీకి చెందిన ఫాంగ్‌ చెంగ్‌ బావో బ్రాండ్‌ కింద ఈ ఎస్‌యూవీని 2025 సెప్టెంబరులో చైనా మార్కెట్లో బావో 7 పేరుతో విడుదల చేశారు. ఆ తర్వాత తాయ్‌ 7గా పేరు మార్చారు. బాక్సీ ఆకారం, నిటారుగా ఉండే ముందు భాగం, చతురస్రాకార వీల్‌ ఆర్చ్‌లు, వెనుక భాగంలో ప్రత్యేక స్టోరేజ్‌ వంటి డిజైన్‌ అంశాలు ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ను పోలి ఉన్నాయనే చర్చ మొదటి నుంచీ ఉంది. అయితే జేఎల్‌ఆర్‌ అభ్యంతరం కేవలం డిజైన్‌కు పరిమితం కాలేదు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతి లేకుండా ఉపయోగించారన్నదే ప్రధాన ఆరోపణ.

వచ్చే జనవరిలో బ్రిటన్‌ మార్కెట్లోకి టీ7 అడుగుపెట్టనుంది. ఏడు సీట్ల డిఫెండర్‌ 110తో పోలిస్తే తక్కువ ధరకు దీన్ని విక్రయించాలనేది బీవైడీ ప్రణాళిక. ఈ నేపథ్యంలో జేఎల్‌ఆర్‌ దాఖలు చేసిన కేసు ఆ సంస్థ అంతర్జాతీయ విస్తరణకు కీలక పరీక్షగా మారింది. గతంలోనూ చైనా సంస్థ జియాంగ్లింగ్‌ మోటార్‌ కార్పొరేషన్‌పై రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ డిజైన్‌ కాపీ ఆరోపణలతో జేఎల్‌ఆర్‌ న్యాయపోరాటం చేసింది. 2019లో ఆ కేసులో విజయం సాధించింది. తాజా కేసులో కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.