అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన చైన్‌సా దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ అలియాస్ దుమ్ము కోల్పోయిన కుడి కాలును భద్రపరచాలని అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆదేశించింది. పోలీసు కాల్పుల్లో నిందితుడు గాయపడిన ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. నిందితుడి కాలును భద్రపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి. మల్లేశ్వరిని, పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.

అక్టోబర్ 31న రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హేమంత్ (21) పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై చైన్‌సాతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రాణాలతో బయటపడి, ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటన జరిగిన మరుసటి రోజే ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అయితే, క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లినప్పుడు అతను తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కాల్పుల్లో హేమంత్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తనాళాలు దెబ్బతినడంతో గ్యాంగ్రీన్ ఏర్పడటంతో, నవంబర్ 3న వైద్యులు అతని కుడి కాలును తొలగించారు. పోలీసుల కాల్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండ గోపీకృష్ణ ఈ పిల్‌ను దాఖలు చేశారు. కాగా, ఈ కేసులో విద్యాశాఖ అధికారులను ప్రతివాదులుగా చేర్చాలన్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.