సినిమాల్లో సింహంలా కనిపించే నందమూరి బాలకృష్ణ ఇంట్లో మాత్రం ఓ విషయంలో వెనక్కి తగ్గుతారట! అది మరెవరి విషయంలోనో కాదు.. తన కూతురు, నారా లోకేశ్‌ భార్య బ్రహ్మణి విషయంలోనట. ఆమె ఇంటికి వస్తే తనకు ఇష్టమైన వంటకాలు తినలేనని బాలయ్య అంటుంటారని లోకేశ్‌ సరదాగా వెల్లడించారు. నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న టాక్‌షోలో పాల్గొన్న ఆయన.. కుటుంబం, చదువు, వ్యాపారం, రాజకీయ ప్రయాణం సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చిన్నప్పుడు తాను చదువులో వెనుకబడి అల్లరి ఎక్కువగా చేసేవాడినని లోకేశ్‌ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్న రోజులను నెమరువేసుకున్నారు. పాఠశాలలో బ్యాక్‌బెంచర్‌గా ఉండేవాడినని, క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఖాళీ సమయం దొరికితే మైదానంలోనే గడిపేవాడినన్నారు. అప్పటి స్నేహితులు ఇప్పటికీ తనతో సన్నిహితంగా ఉంటారని, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు తనకు సలహాలు ఇస్తుంటారని తెలిపారు. తమకంటూ ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ఉందని, అందులో సరదాగా మాట్లాడుకుంటామని చెప్పారు. ఉపాధ్యాయులు అప్పట్లో విధించిన క్రమశిక్షణే తన ఎదుగుదలకు ఉపయోగపడిందని పేర్కొన్నారు.

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తొలినాళ్లు అంత సులభంగా సాగలేదని లోకేశ్‌ చెప్పారు. మొదటి సెమిస్టర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ తర్వాత స్వతంత్రంగా జీవించడం అలవాటైందని వివరించారు. కంఠస్థం చేయడం కంటే ఒక అంశాన్ని అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యమిస్తానన్నారు. అమెరికా విద్యావిధానంలో విశ్లేషణాత్మక ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. పని సంస్కృతిని తెలుసుకునేందుకు జీఈ సంస్థలో పనిచేశానని తెలిపారు. జర్మనీలోనూ ఉద్యోగ అనుభవం పొందానని వెల్లడించారు. సింగపూర్‌ ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసిన అనుభవం కూడా ఉందన్నారు.

బ్రహ్మణి చదువులో చిన్నప్పటి నుంచే ప్రతిభ చూపేవారని లోకేశ్‌ తెలిపారు. తాను స్టాన్‌ఫోర్డ్‌లో చదివిన ఐదేళ్ల తర్వాత ఆమె కూడా అదే విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారని చెప్పారు. ఎంబీఏ కోసం దరఖాస్తు చేసుకున్న ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ ఆమెకు ప్రవేశం లభించిందని వెల్లడించారు. చివరకు స్టాన్‌ఫోర్డ్‌ను ఎంచుకున్నారని వివరించారు. చంద్రబాబు తమ కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారికి అప్పగించారని, బ్రహ్మణి హెరిటేజ్‌ సంస్థ వ్యవహారాలు చూసుకుంటుండగా, తల్లి భువనేశ్వరి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

హెరిటేజ్‌ సంస్థలో తన ప్రయాణం గురించి కూడా లోకేశ్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అమెరికా నుంచి తిరిగొచ్చి సంస్థ బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాది రూ.6 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత సంస్థను లాభాల బాట పట్టించేందుకు పరిశోధనలు చేశానన్నారు. పెరుగును చిన్న ప్యాకెట్లలో అందించే ఆలోచన తనకు వచ్చిందని, దీనిపై చేసిన కృషి మంచి ఫలితాన్నిచ్చిందని వివరించారు.

తండ్రి చంద్రబాబు బిజీగా ఉండటంతో చిన్నతనంలో ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం తనకు దక్కలేదని లోకేశ్‌ చెప్పారు. అదే పరిస్థితి తన కుమారుడు దేవాన్ష్‌కు ఎదురుకాకూడదని నిర్ణయించుకున్నానన్నారు. అందుకే ఆదివారాలు భార్య, కుమారుడితో గడుపుతానని తెలిపారు. దేవాంశ్‌ పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడని, గంటల తరబడి చదువుతుంటాడని చెప్పారు. తాను అతడి పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతానన్నారు.

కుటుంబ విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు బాలకృష్ణ గురించి లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. అందరికీ ఆయన బాలయ్య అయితే, తనకు మాత్రం ముద్దుల మావయ్య అని చెప్పారు. బ్రహ్మణి ఇంటికి భోజనానికి వస్తే తాను అనుకున్న వంటకాలు తినలేకపోతానని బాలకృష్ణ అంటుంటారని వెల్లడించారు. అందుకే ఆమెను లంచ్‌కు తీసుకురావద్దని తనతో పదేపదే చెబుతుంటారని సరదాగా వివరించారు.

రాజకీయాల్లోకి రావడం వెనుక పరిస్థితులనూ లోకేశ్‌ వివరించారు. 2014 నుంచి 2019 వరకు పార్టీ కార్యకర్తగా పనిచేశానని, 2019లో తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేశానని చెప్పారు. కుప్పం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినా, అది ఆయన స్థానం కావడంతో అంగీకరించలేదన్నారు. 1985 తర్వాత టీడీపీ గెలవని మంగళగిరి నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తొలి ఎన్నికలో ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడలేదని, 2019 నుంచి 2024 వరకు అక్కడి ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో 2024లో భారీ మెజార్టీతో విజయం సాధించానన్నారు.

2023 సెప్టెంబరులో చంద్రబాబు అరెస్టు తనను తీవ్రంగా కలచివేసిందని లోకేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో తాను యువగళం పాదయాత్రలో ఉన్నానని చెప్పారు. అరెస్టుకు రెండు రోజుల ముందే అలాంటి సంకేతాలు వచ్చినా, ఎలాంటి తప్పు చేయని తన తండ్రిని అరెస్టు చేస్తారని అనుకోలేదన్నారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించడంపై ఒక కుమారుడిగా ఎంతో ఆందోళన చెందానన్నారు. ఆ కష్టకాలంలో అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబును జైలులో కలిసిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ తమతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారని, ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించిందని గుర్తుచేసుకున్నారు.