అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అయితే, సమావేశానికి ముందు కేబినెట్ హాల్ వద్ద ఆహ్లాదకరమైన, ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భారీ విజయం నమోదు చేయడంతో మంత్రుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఈ నేపథ్యంలో సమావేశ మందిరంలోకి వెళ్లే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకరికొకరు ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి హాల్‌లోకి అడుగుపెట్టారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లోపలికి రాగానే మంత్రులంతా ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఘన స్వాగతం పలికారు. మంత్రుల హర్షధ్వానాలతో కేబినెట్ సమావేశ మందిరం మార్మోగిపోయింది. ఎన్నికల్లో కూటమి అద్భుతమైన స్ట్రైక్ రేట్ సాధించిందంటూ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'హిట్ కొట్టాం' అంటూ పలువురు మంత్రులు ఉత్సాహంగా నినదిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల విజయోత్సాహం నడుమ ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. పారిశ్రామిక ప్రగతి, కొత్త పెట్టుబడుల సాధన, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు దాదాపు 30కి పైగా అంశాలు ఈ భేటీ అజెండాలో ఉన్నాయి. కీలక పాలసీలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.