ప్రజలకు సమాన అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ (CNES) విడుదల చేసిన 'యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ (AEI)–2026'లో ఏపీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ నివేదిక ప్రకారం, ఏపీని 'ఫ్రంట్ రన్నర్' రాష్ట్రంగా గుర్తించారు.

ఈ ఇండెక్స్‌లో 0.68 స్కోరుతో గోవా మొదటి స్థానంలో నిలవగా, 0.66 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. సిక్కిం (0.63), కేరళ (0.60), తమిళనాడు, తెలంగాణ (0.57) రాష్ట్రాలు ఏపీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రాథమిక సదుపాయాలు, విద్య, వైద్యం, న్యాయ సేవలతో పాటు సామాజిక-ఆర్థిక భద్రత వంటి ఐదు ప్రధాన అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించారు. ముఖ్యంగా, సామాజిక, ఆర్థిక భద్రత కల్పనలో ఆంధ్రప్రదేశ్ 0.69 స్కోరుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం.

తలసరి ఆదాయంలో దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలకు అవకాశాలు కల్పించడంలో ఏపీ రెండో స్థానంలో నిలవడం ఈ నివేదికలోని కీలక అంశం. రాష్ట్ర ఆదాయ స్థాయిని బట్టి ఏపీ 0.51 స్కోరు సాధిస్తుందని అంచనా వేయగా, వాస్తవానికి 0.66 స్కోరును నమోదు చేసింది. అంటే, ఆదాయానికి మించి ప్రజలకు సేవలు అందించడంలో ఏపీ మెరుగైన పనితీరు కనబరుస్తోందని నివేదిక స్పష్టం చేసింది.

ఈ ర్యాంకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గత రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు ఈ నివేదిక నిదర్శనమని అన్నారు. సంపద సృష్టించడంతో పాటు, ఆ ఫలాలను ప్రజలకు అవకాశాలుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన వల్లే ప్రజలు తమకు అండగా నిలుస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.