ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజుల తర్వాత కూడా ఉత్తరాదిలోని అత్యధిక ప్రాంతాలను దట్టమైన పొగమంచు (స్మాగ్) కమ్మేసింది. అంతరిక్షం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ కాలుష్య మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నాసా వరల్డ్‌వ్యూ తాజా చిత్రాల ద్వారా వెల్లడైంది.

నాసా విడుదల చేసిన నవంబర్ 10 చిత్రాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వాటి సమీప రాష్ట్రాల్లో ఈ పొగమంచు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఇది మైదాన ప్రాంతాలకే పరిమితం కాకుండా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల వరకు విస్తరించింది. మరోవైపు మధ్య, దక్షిణ భారతదేశంలోనూ దీని ప్రభావం కొంతమేర కనిపించినప్పటికీ, తీవ్రత తక్కువగానే ఉంది. అయితే రాజస్థాన్, గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం చాలావరకు నిర్మలంగా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

దీపావళి నాటి నుంచి దేశంలోని వాయు పరిస్థితులను పరిశీలిస్తే గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. నవంబర్ 8న పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంతో ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లతో పాటు ఇతర ఉత్తరాది ప్రాంతాలను దట్టమైన పొగ కప్పేసింది. నవంబర్ 9 నాటికి ఈ పొగ కొంత పలుచబడి పలు ఉత్తరాది రాష్ట్రాలు, బీహార్, పర్వత ప్రాంతాల మీదుగా విస్తరించింది. ఇక నవంబర్ 10 నాటికి ఇది మరింత విస్తృతమై, దేశంలోని విశాల భూభాగాన్ని దట్టమైన బూడిద రంగు దుప్పటిలా కప్పేసినట్లు నమోదైంది.

శీతాకాలం ప్రారంభం కావడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు వాతావరణ పరిస్థితుల వల్ల కాలుష్య కారకాలు గాలిలోనే చిక్కుకుపోతున్నాయి. దీనికి తోడు పొలాల్లో వ్యర్థాలు తగులబెట్టడం (స్టబుల్ బర్నింగ్), బాణసంచా పొగ, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు తోడవ్వడంతో నవంబర్ మొదటి వారం నుంచే కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.

ఈ తీవ్ర పరిస్థితుల నడుమ దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడటం కొంత ఊరటనిచ్చింది. మంగళవారం గాలుల వేగం పెరగడంతో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 299 వద్ద నమోదైంది. అంతకుముందు రోజు ఇది 376 పాయింట్లతో "చాలా తీవ్రమైన" (వెరీ పూర్) కేటగిరీలో ఉండగా, తాజాగా "పూర్" విభాగానికి చేరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిబంధనల ప్రకారం ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే 'పూర్' అని, 301 నుంచి 400 మధ్య ఉంటే 'వెరీ పూర్'గా పరిగణిస్తారు. ప్రస్తుతానికి గాలి నాణ్యత కాస్త మెరుగైనప్పటికీ, కాలుష్య ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.