ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ సంజయ్ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఆయన పదవీ విరమణ తేదీ అయిన 2027 మార్చి 31 వరకు లేదా ఆయనపై ఉన్న క్రిమినల్ విచారణ ముగిసే వరకు (ఏది ముందైతే అది) సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం అధికారిక జీవో విడుదల చేసింది.

గతంలో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ డీజీగా పనిచేసిన సమయంలో ‘అగ్ని’ వెబ్ పోర్టల్ నిర్వహణలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సంజయ్‌పై వచ్చాయి. అంతేకాకుండా, ఏపీ సీఐడీ అడిషనల్ డీజీపీగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టంపై పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1.15 కోట్లు నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ అభియోగాల నేపథ్యంలో, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969లోని రూల్ 3(1) ప్రకారం ప్రభుత్వం 2024 డిసెంబర్ 3న సంజయ్‌ను తొలిసారి సస్పెండ్ చేసింది. అనంతరం 2024 డిసెంబర్ 24న ఏసీబీ ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. మరోవైపు, సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో ఆయనపై రెగ్యులర్ శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతోంది. విచారణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఆయన సస్పెన్షన్‌ను సర్వీస్ ముగిసే వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.