టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రింకూ సింగ్‌ పెళ్లి సందడి మొదలైంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడు ఏడడుగులు వేయడానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్‌ 4న లక్నోలోని రమదా బై వింధమ్‌ హోటల్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లి పత్రికలు ముద్రించారు. కుటుంబ సభ్యులు బంధువులు, ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు.

వివాహ ఏర్పాట్లను రింకూ దగ్గరుండి చూసుకుంటున్నాడు. తన సోదరి నేహాతో కలిసి పెళ్లి పత్రికలను స్వయంగా ఎంపిక చేశాడు. అతిథుల ఆహ్వానాలు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. ఈ నెల చివర్లో ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ కోసం దుబాయ్‌ వెళ్లాల్సి ఉంది. ఈలోగా పెళ్లికి సంబంధించిన ప్రధాన పనులన్నీ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. దీపావళి సందర్భంగా స్వస్థలం అలీగఢ్‌కు వెళ్లిన రింకూ కుటుంబ సభ్యులతో గడిపాడు. పెళ్లి ఏర్పాట్లపై సమీక్షించాడు. ఆ సమయంలో తన సోదరి నేహాకు స్కూటీని బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా స్వయంగా కలిసి పెళ్లికి ఆహ్వానించాలని రింకూ భావిస్తున్నాడని సమాచారం. ఇందుకోసం అపాయింట్‌మెంట్‌ కోరనున్నట్లు తెలుస్తోంది. తల్లి, సోదరుడితో కలిసి సీఎంను కలిసే అవకాశం ఉంది. ఈ నెల 14 లేదా 15 తేదీల్లో ఈ భేటీ జరిగే అవకాశముందని సమాచారం. అనంతరం రింకూ దుబాయ్‌కు బయలుదేరనున్నాడు.

ఈ పెళ్లి రింకూ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది ఆరంభంలో తండ్రిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. అయినప్పటికీ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ నాయకులు, స్నేహితులు, కుటుంబ సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.