పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టీవీ యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్ రబియా అహ్సన్ (41) మృతి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. రావల్పిండిలోని తన నివాసంలో ఆదివారం తుపాకి కాల్పుల్లో ఆమె మరణించింది. ఈ ఘటనలో ఆమె భర్తను ప్రధాన నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి.

సోమవారం నిందితుడైన ఆమె భర్త అహ్సన్ తాహిర్‌ను స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఒకరోజు ఫిజికల్ రిమాండ్‌కు అనుమతించింది. అయితే, తొలుత ఇది హత్యేనని ఫిర్యాదు చేసిన రబియా సోదరుడు ఖుర్రం అహ్మద్, సోదరి అల్వీనా.. ఇది "100 శాతం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన" అని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెబుతూ హత్య కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ, కొద్దిసేపటికే సోదరుడు ఖుర్రం ఈ వార్తలను ఖండించడం గమనార్హం. కేసు ఉపసంహరణపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆయుధానికి లైసెన్స్ లేదని గుర్తించారు. దగ్గర నుంచి కాల్పులు జరగలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చిన తర్వాతే మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు.

‘92 న్యూస్’ హెచ్‌డీ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న రబియాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రథమ మహిళ ఆసిఫా భుట్టో-జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.