హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. తీసుకున్న రూ. 40,000 అప్పు చెల్లింపు ఆలస్యం కావడంతో, నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ బెటాలియన్‌లో పనిచేస్తున్న శ్రీను మహేశ్వరం మండలం, హర్షగూడలో నివసిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఓ మొబైల్ లోన్ యాప్ ద్వారా శ్రీను రూ. 40,000 అప్పు తీసుకున్నారు.

సకాలంలో అప్పు చెల్లించలేకపోవడంతో యాప్ ఏజెంట్లు ఆయనను వేధించడం మొదలుపెట్టారు. దీపావళి సెలవుల్లో కూడా గంటగంటకూ ఫోన్లు చేస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అప్పు వెంటనే చెల్లించకపోతే, శ్రీను, ఆయన భార్య నగ్న చిత్రాలను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు పంపుతామని బెదిరించారు. ఈ బెదిరింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీను, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. లోన్ యాప్ నిర్వాహకులు, రికవరీ ఏజెంట్ల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల దూకుడు వైఖరి, వ్యక్తిగత డేటాను అక్రమంగా వాడుకుంటూ రుణగ్రహీతలను వేధించే తీరుకు ఈ ఘటన మరోసారి అద్దం పడుతోంది.